Ticket Tension in Ananthapurma TDP Leaders: ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లా టీడీపీ నేతలకు టికెట్ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలుండగా.. తొలి జాబితాలో 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరిని ప్రకటిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం, జనసేన కూటమిలో అభ్యర్థులు ఎవరన్నది ఇంకా స్పష్టత లేకపోవడంతోనే మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ - జనసేన కూటమి, బీజేపీతో పొత్తు కుదిరితే జిల్లాలో కొన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కూడా ఉంది. దీనికి అనుగుణంగానే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు వారి అధినేతల ముందు వారి బయోడేటా ఉంచి తమకి టికెట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు


ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, తాడిపత్రి, ఉరవకొండ, మడకశిర, రాయదుర్గం, శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గం అభ్యర్థులు ఖరారు కాగా.. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. అనంత అర్బన్ ఇంఛార్జీగా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి మొదటి లిస్టులో తన పేరు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానంపై జనసేన నేతలు కూడా తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు కదిరి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను ఆశీర్వదించాలని ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో దాదాపుగా కదిరి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆయన ఖరారైనట్లు తేలిపోయింది. అనూహ్యంగా మొదటి జాబితాలో కందికుంట వెంకటప్రసాద్ పేరు లేకపోవడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే అక్కడ వైసీపీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఈనయ్ తుల్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం కూడా ముస్లిం నేతనే బరిలోకి దించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.


అటు, గుంతకల్లు నియోజకవర్గం ఇంఛార్జీగా ఉన్న జితేంద్ర గౌడ్ తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్న తరుణంలో తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు, మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడుతారన్న ప్రచారం ఊపందుకున్న క్రమంలో ఆయన కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు, బీసీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఖరారు విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి నియోజకవర్గంలోనూ రాజకీయ వేడి పెరిగింది. నియోజకవర్గంలో అన్ని తానై చూసుకునే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలో ఆయన పేరు లేదు. అయితే, వడ్డే సామాజిక వర్గానికి చెందిన మరో నేత కూడా టీడీపీ నుంచి పుట్టపర్తి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పల్లె రఘునాథ్ రెడ్డికే పుట్టపర్తి టికెట్ ఇస్తారా లేక వారి కుటుంబ సభ్యులకు కేటాయిస్తారా.? అనే దానిపై రెండో జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ధర్మవరంలో ఎవరు.?


రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు పోటీలో ఉంటారా అనేది ఉత్కంఠగా మారింది. 2019 ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ను ఇంఛార్జీగా చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం ఆ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం ఆశిస్తున్నారు. దీంతో శ్రీరామ్ కు టికెట్ గండం పొంచి ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే, గోనుగుంట్ల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఇంకా స్పష్టత లేదు. జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ధర్మవరం టికెట్ ను బీజేపీ తరఫున గోనుగుంట్లకు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు, టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు రెండో జాబితా విడుదల చేసేంతవరకు ఈ నియోజకవర్గాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించటం లేదు. నియోజకవర్గాల్లో నేతలు మాత్రం ఎవరికి వారు టికెట్ తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also Read: YS Sunitha News: జగన్‌ను ఓడిస్తేనే నా తండ్రి హత్యకేసులో న్యాయం- వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు