Three Controversied MLAs Who Produced Junior NTR Movies: రాజకీయాల్లో, సినిమాల్లోనూ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పోలికలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తర్వాత కాలంలో కాంట్రవర్సీకి క్యారఫ్ అడ్రస్‌గా మారారు. ఈ ముగ్గురు కూడా టీడీపీలో ఎమ్మెల్యేలుగా పని చేసి తర్వాత కాలంలో అదే పార్టీపై విమర్శలు చేయడం గమనార్హం. వీరితో ఉన్న సాహిత్యం వల్ల సంబంధం లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ కొన్నిసార్లు టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వారే చెంగల వెంకట్రావు, కొడాలి నాని, వల్లభనేని వంశీ.
చెంగల వెంకట్రావు - నరసింహుడు (2005)
నందమూరి బాలకృష్ణ కం బ్యాక్ ఫిల్మ్‌గా రికార్డులు సృష్టించిన "సమరసింహారెడ్డి (1999)" నిర్మాతగా ఒక్కసారిగా హైలెట్‌లోకి వచ్చిన వ్యక్తి చెంగల వెంకట్రావు. పాయకరావుపేటకు చెందిన వెంకట్రావు ఆ సినిమా తర్వాత టీడీపీకి దగ్గరయ్యారు 1999, 2004 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో జూనియర్ ఎన్టీఆర్‌తో "నరసింహుడు" సినిమా తీశారు. అమీషా పాటిల్, సమీరారెడ్డి లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంతో ఖర్చు పెట్టి సినిమాకి ఎంపిక చేశారు. ఆ రోజుల్లోనే ఆ సినిమా ఖర్చు రూ.20 కోట్లు అని ప్రచారం జరిగింది. ప్రొడక్షన్ ఖర్చు కోసం ఫైనాన్సర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బు వేరే ఖర్చులకు వాడేశారనేది అప్పట్లో వెంకట్రావుపై జరిగిన ప్రచారం. దాంతో సినిమా రిలీజ్ సమయానికి డబ్బు తిరిగి చెల్లించలేకపోవడంతో విడుదల విషయంలో జాప్యం జరిగింది. ఓ వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి మరోవైపు ఫైనాన్షియర్ల నుంచి ఆందోళనల నేపథ్యంలో వెంకట్రావు హుస్సేన్ సాగర్‌లో దూకారు. తర్వాత ఎన్టీఆర్ కల్పించుకొని సినిమాను రిలీజ్ చేశారు. కానీ అది ప్లాప్ అయింది. తర్వాత కాలంలో వెంకట్రావు టీడీపీపై విమర్శలు గుప్పించి వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పటికీ బాలకృష్ణ అన్నా, జూనియర్ ఎన్టీఆర్ అన్నా గౌరవంతోనే మాట్లాడుతారు వెంకట్రావు.
కొడాలి నాని - "సాంబ (2004)"
జూనియర్ ఎన్టీఆర్‌కి ఆల్మోస్ట్ కేర్ టేకర్ అనే స్థాయిలో ప్రచారం ఉన్న కొడాలి నాని నిర్మాతగా తీసిన సినిమా 'సాంబ'. ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ 'ఆది ' సినిమా రషెస్ చూసి వినాయక్- ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీయాలని నాని ఫిక్స్ అయ్యారు. అయితే అది కార్యరూపం దాల్చడానికి టైం పట్టింది. ఈ లోపు ఎన్టీఆర్ కెరియర్‌లో "సింహాద్రి" లాంటి బ్లాక్ బస్టర్ "ఆంధ్రావాలా" లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ఆ తర్వాత మళ్లీ వినాయక్ కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా అనగానే అంచనాలు భారీ స్థాయిలోకి వెళ్లిపోయాయి. ఆ సినిమానే "సాంబ". చదువుకు సంబంధించిన మంచి పాయింట్‌తో వచ్చిన ఈ యాక్షన్ మూవీ హిట్ అయ్యింది. నిర్మాతగా కొడాలి నానికి మంచి లాంచింగ్ ఇచ్చింది. అప్పటికే హరికృష్ణ ఎన్టీఆర్‌ల రిఫరెన్స్‌తో టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కొడాలి నాని. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2012లో వైసీపీలోకి వెళ్లిపోయారు. 2014, 2919 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి మంత్రిగా కూడా కొంతకాలం పని చేశారు. కానీ టీడీపీని వీడిన తర్వాత హద్దు అదుపు లేకుండా చంద్రబాబు, లోకేష్‌లపై నాని విమర్శలతో విరుచుకుపడేవారు. ఆయన వాడే భాషపై తీవ్రమైన విమర్శలు ఉండేవి. అయినా కానీ నాని లెక్క చేసేవారు కాదు. తనకు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదని కొడాలి నాని చాలాసార్లు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా మొదట్లో నానికి సపోర్ట్ చేసినందుకు ఎన్టీఆర్‌పై టీడీపీలో ఓ వర్గం ఇప్పటికీ గుర్రుగానే ఉంది. వల్లభనేని వంశీ అరెస్టుతో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అంటూ పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.
వల్లభనేని వంశీ- "అదుర్స్ (2010)"
Jr ఎన్టీఆర్ కెరీర్‌లో మరుపురాని చిత్రం "అదుర్స్". ఇప్పటికీ ఆయన అభిమానులు 'చారి ' పాత్రను తమ ఆల్ టైం ఫేవరెట్‌గా చెబుతుంటారు. ఎన్టీఆర్‌కు అంతటి సక్సెస్ ఇచ్చిన 'అదుర్స్' సినిమా ప్రొడ్యూసర్ వల్లభనేని వంశీ. తన స్నేహితుడు కొడాలి నాని ద్వారా ఎన్టీఆర్‌కు పరిచయమైన వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. కొడాలి నాని లాగానే 'ఎన్టీఆర్ -వినాయక్ ' కాంబినేషన్‌లో ఈ సినిమా తీశారు. దానికంటే ముందు ముమైత్ ఖాన్‌తో'.. 'పున్నమినాగు'(2009), ఈ మధ్యన రవితేజతో 'టచ్ చేసి చూడు' (2018) లాంటి సినిమాలు కూడా తీశారు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఉన్న సాహిత్యంతో టీడీపీకి చేరువైన వంశీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన లోకేష్‌తో ఉన్న విభేదాలతో టీడీపీని వదిలి వైసీపీకి దగ్గరయ్యారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధిష్టానంపై వంశీ చేసిన విమర్శలు వాడిన భాష ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా బాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి పై వాడిన అసభ్యకరమైన భాష, చంద్రబాబుపై చేసిన ఆరోపణలు ఆ సందర్భంగా కన్నీటి పర్యంతమైన చంద్రబాబు ఆవేదనకు కారణం వల్లభనేని వంశీనే అని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. తర్వాత వల్లభనేని వంశీ సారీ చెప్పినా తన తల్లిని దూషించిన వంశీని వదిలేది లేదని లోకేష్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఈలోపు 2023 నాటి గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసు, అందులో బాధితులపై ఒత్తిడి తెచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశారంటూ మరో కేసు వంశీ మెడకు చుట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వంశీ అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండులో ఉన్నారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తర్వాత కాలంలో పార్టీని వదిలి అధిష్టానంపై విమర్శలు గుప్పించడం ఒక చిత్రమైన పోలికలా మిగిలిపోయింది.