Thiruvuru MLA Kolikapudi: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా గుర్తింపు పొంది, చంద్రబాబు నాయుడు నమ్మకంతో టికెట్ ఇచ్చి గెలిపించిన కొలికపూడి.. ప్రస్తుతం అదే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా  యుద్ధం ప్రకటిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.  

Continues below advertisement

 వాట్సాప్ స్టేటస్‌లే అస్త్రాలుగా.. 

కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా తన అసంతృప్తిని నేరుగా కాకుండా వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.  ఆయన పెట్టిన ఓ స్టేటస్ కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది.  3 వారాల పాటు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపాను.. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు.. పల్లె కన్నీరు పెడుతోంది అనే అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేయడం, పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, విపక్ష వైసీపీ విమర్శించే తీరులోనే ఆయన పోస్ట్‌లు ఉండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.

Continues below advertisement

 సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు 

కేవలం ప్రభుత్వంపైనే కాకుండా, పార్టీలోని కీలక నేతలను కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన వద్ద టికెట్ కోసం రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని, ఇప్పటికే కొంత మొత్తం చెల్లించానని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో మండల అధ్యక్షుల ఎంపికలో తన ప్రమేయం లేదని, పేకాట క్లబ్‌లు నడిపేవారికి పదవులు ఇస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలు టీడీపీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.

 వైసీపీకి దగ్గరవుతున్నారా? 

కొలికపూడి వైఖరి చూస్తుంటే ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కూడా కొలికపూడిని  వైసీపీ కోవర్టు గా అభివర్ణించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. గతంలో  వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన భేటీ అవ్వడం, వైసీపీ సర్పంచ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో.. ఆయన త్వరలోనే కండువా మార్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

 పార్టీ చర్యలు - కొలికపూడి వైఖరి                                          

ఇప్పటికే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఆయనను హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొలికపూడి మాత్రం తన తీరు మార్చుకోకపోగా, మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పార్టీ తనపై చర్యలు తీసుకుంటే, అది తనకు రాజకీయంగా మైలేజ్ ఇస్తుందని, సానుభూతి పొందే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ, పార్టీ యంత్రాంగాన్ని పక్కన పెట్టేశారు. అలాగే టీడీపీ నుంచి కూడా ఆయనకు పిలుపులు రావడం లేదు.