Local elections in AP in March Will YSRCP contest :   ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.  ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పా  అనుసరిస్తున్న మౌనం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించకపోవడంతో, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినట్లే.. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Continues below advertisement

వైసీపీ మౌనం - వ్యూహమా? వైఫల్యమా 

సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ సూచనలు రాగానే అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకంపై పార్టీలు కసరత్తు చేస్తాయి. కానీ వైసీపీలో ప్రస్తుతం అటువంటి సందడి ఎక్కడా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత క్యాడర్‌ను తిరిగి సమీకరించడంలో నాయకత్వం కొంత తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కూటమి దూకుడుగా ఉండటం, పోలీసులు , అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని గతంలోనే పార్టీ ప్రకటించినందున , పోటీకి దూరంగా ఉండటమే మేలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 

Continues below advertisement

 బహిష్కరణ  ప్రచారంపై క్యాడర్ ఆందోళన 

ఎన్నికలను బహిష్కరిస్తే పరువు దక్కుతుందనేది ఒక వాదన అయితే, అది పార్టీ మనుగడకే ముప్పు అనే సంకేతాలు క్షేత్రస్థాయి నుంచి అందుతున్నాయి. స్థానిక ఎన్నికలు అంటే కేవలం పార్టీ గెలుపోటములే కాదు, గ్రామాల్లో నాయకులు తమ ఉనికిని కాపాడుకునే అవకాశం. ఒకవేళ పార్టీ పోటీ చేయకపోతే, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా అనాథలయ్యే ప్రమాదం ఉంది. పోటీలో లేకపోతే క్యాడర్ నిరుత్సాహపడి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార కూటమి వైపు లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంది.

పోటీ చేయకపోవడం - రాజకీయ మైనస్ 

రాజకీయాల్లో  మైదానం వదిలి వెళ్లడం  ఎప్పుడూ సరైన సంకేతం కాదు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న తరుణంలో, స్థానిక ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుంది. ఎన్నికల్లో ఓడినా పోరాడామనే ముద్ర ఉంటే భవిష్యత్తుపై ఆశ ఉంటుంది, కానీ పోటీనే చేయకపోతే పార్టీ బలహీనపడిందనే ముద్ర శాశ్వతంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇది పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడమే కాకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని దెబ్బతీస్తుందన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. 

వైసీపీ నాయకత్వం ఈ ప్రచారాన్ని ఖండించి, కేడర్‌లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం ద్వారానే కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. పరీక్షల లోపే ఎన్నికలు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా, పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. లేనిప క్షంలో, ఈ స్థానిక ఎన్నికలు వైసీపీ ఉనికికి పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.