MAVIGUN News: ఏపీ రాజకీయాల్లో నెల క్రితం తీవ్ర సంచలన సృష్టించిన "మావిగన్ " అనే పదం ఒక్కసారిగా మాయమైంది. నేతల నోట రావడం మానేసింది. ఆ పదాన్ని ట్రోల్ చేస్తూ హడావిడి చేసిన కూటమి గాని, మావిగన్ పదాన్ని సపోర్ట్ చేస్తూ వరుస ప్రెస్ మీట్‌లు పెట్టిన వైసీసీ గానీ మాట్లాడుకండా సైలెంట్ అయిపోయారు. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో మావిగన్‌పై ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందని పరిశీలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయ్. ప్రపోజల్ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గానీ దానికి కౌంటర్ ఇస్తూ సెటైర్‌లు వేసిన కూటమి గానీ మావిగాన్‌పై పాటిస్తున్న మౌనంపై కారణాలు ఏంటో చూద్దాం.
మావిగన్ పై అనవసర పబ్లిసిటీ వద్దు అనుకుంటున్న కూటమి
జగన్ నోటి వెంట మావిగన్ అనే పేరు వినగానే దాన్నో ట్రోల్ మెటీరియల్‌గా మార్చే ప్రయత్నం చేసింది కూటమి. ఆ పేరు కాస్త విచిత్రంగా ఉండడమే దానికి ప్రధాన కారణం. అయితే తాము చేసే ప్రచారం వల్ల మావిగన్‌కు తెలియకుండానే జనంలో పాపులారిటీ వచ్చే అవకాశం ఉండడంతో నెమ్మదిగా మాట్లాడటం తగ్గించేసింది కూటమి. జగన్ పై ఏ మాత్రం అవకాశం వచ్చినా విమర్శలు గుప్పించడానికి సిద్దపడే చంద్రబాబు, లోకేష్ సడన్‌గా మావిగన్‌పై మాట్లాడటం తగ్గించేశారు.
మావిగన్ పేరు వినడానికి విచిత్రంగా ఉన్నా దాని వెనుక జగన్ చెప్పిన లాజిక్‌ను జనాలకు చేరకుండా స్కెచ్ వేసింది. అమరావతిపై కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆల్రెడీ డెవలప్ అవుతోన్న విజయవాడ, గుంటూరుకు మచిలీపట్నం కలిస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందే రాజధాని వచ్చేస్తుందనే ఆలోచన వస్తే ప్రమాదమని టీడీపీ అధినాయకత్వం గ్రహించింది. ఎప్పుడైతే కూటమిని నడిపిస్తున్న టీడీపీ సైలెంట్ అయిందో కూటమిలోని జనసేన, బీజేపీ కూడా మావిగన్ ఊసెత్తడం లేదు.
మావిగన్‌పై మాట్లాడటానికి టైం ఉందని భావిస్తున్న వైసీపీ హై కమాండ్
'మావిగన్' ప్రస్థానం మొదటిగా తీసుకువచ్చి సంచలనం సృష్టించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పేరు ఎత్తడం లేదు. కనీసం ముందస్తు సూచన ఏదీ లేకుండా మావిగన్ అంశం తేవడంతో కన్ఫ్యూజ్ అయిన వైసీపీ కార్యకర్తలు కూడా ప్రస్తుతానికి పూర్తి క్లారిటీ లేక డిఫెన్స్ లో పడ్డారు. ఇక పార్టీ నేతలు, మాజీ మంత్రులదీ అదే దారి. మావిగన్ పేరు ఎత్తగానే "2019-24 మధ్యలో ఏం చేశారు?" అనే కౌంటర్ అధికార పక్షం నుంచి వస్తోంది. దానికి వారివద్ద సరైన సమాధానం లేదు.
Also Read: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
మరో వైపు జగన్ మెహన్ రెడ్డి కూడా మావిగన్‌ను నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మరో యాత్ర చేపట్టబోతున్నారు. ఆ సమయంలో రాజధాని పై ప్రజల స్పందన బట్టి మావిగన్‌పై ముందుకు వెళ్దామా వద్దా అనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి మావిగన్ పై వైసీపీ కూడా మొదట్లో ఉన్నంత దూకుడు చూపడం లేదు అనేది విశ్లేషకుల మాట. దానితో ఇటు విపక్షం, అటు అధికార పక్షం రెండూ మావిగన్ పై సైలెంట్ అయిపోయాయి.
