AP local elections : ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13,100 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలన మొత్తం ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రభుత్వం ఈ వేసవిలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
వేసవిలో ఎన్నికల నిర్వహణకు అనుకూలం
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ మళ్ళీ పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో, క్షేత్రస్థాయిలో పాలన స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే, గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సుదీర్ఘకాలం అధికారుల పాలనను కొనసాగించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీలైనంత త్వరగా అంటే.. మే లేదా జూన్ నెలల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో, ప్రభుత్వ భవనాలు, ఉపాధ్యాయుల సేవలను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం సులభతరం అవుతుంది. ఇదే తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే అటు విద్యా సంవత్సరంపై ప్రభావం ఉండదని, ఇటు వర్షాకాలం మొదలవ్వకముందే కొత్త పాలకవర్గాలు కొలువు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
కూటమితో సమన్వయానికి ప్రయత్నాలు
వార్డుల పునర్విభజన , రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ స్థానిక ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జనసేన, బీజేపీలతో కలిసి రిజర్వేషన్ల కేటాయింపులో ఎక్కడా వివాదాలు రాకుండా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతిక ప్రక్రియ మే నెలలో పూర్తి చేసి, జూన్ కల్లా పోలింగ్ నిర్వహించేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పోటీ చేసి.. క్యాడర్ లో ఉత్సాహం నింపాలనుకుంటున్న వైసీపీ
ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికలపై గట్టి ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తమ క్యాడర్‌లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపాలంటే స్థానిక సంస్థల ఎన్నికలే సరైన వేదిక అని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీపై సానుకూలత ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం ద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఉపాధి హామీ నిధులు, గ్రామాలకు వచ్చే కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించాలంటే ఎన్నికైన పాలకవర్గాలే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ నిబంధన కూడా దీనికి ప్రధాన కారణం.
వేసవిలో జరపకపోతే మరితం ఆలస్యం
వేసవి సెలవుల లోపు నోటిఫికేషన్ విడుదల కాకపోతే, జూలైలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, సెక్షన్ 14 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వీలైనంత వేగంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
