RSS Target BRS: తప్పుడు ఆరోపణలు చేసినందుకు పర్యవసానాలు తప్పక అనుభవించాల్సిందేనని ఫామ్ హౌస్ కేసు విషయంపై తెలంగాణ సర్కార్‌ను బీఎల్ సంతోష్ హెచ్చరించారు. ఆ హెచ్చరికల పర్యవసానాలు ఎలా ఉంటాయో కానీ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడానికి బీజేపీతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా తమ శక్తియుక్తులు మొత్తం వెచ్చించాలని నిర్ణయంచినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుంటే... బీఎల్ సంతోష్ ఆరెస్సెస్ పెద్ద మనిషి. ఆరెస్సెస్ తరపున బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. ఆయన ఎలాంటి  పదవులు తీసుకోరు. కేవలం పార్టీ కోసం పని చేస్తారు. అలాంటి తమ నేతను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని.. తాము ఎలా కామ్‌గా ఉండగలమని ఆరెస్సెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పరివార్‌ సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్‌ ముఖ్యుల భేటీ జరిగిందని ఇందులో బీఆర్ఎస్‌ను ఓడించడానికి ఆరెస్సెస్ పరంగా ఏం  చేయాలో ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారని చెబుతున్నారు. 


తెలంగాణలో బీజేపీ కోసం ఆరెస్సెస్ ప్రత్యేక వ్యూహం 


'తెలంగాణలో  ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని ఆరెస్సెస్‌ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కార్యరంగంలోకి దిగాలని ఆరెస్సెస్ నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ కేసులో ఆరెస్సెస్ అగ్రనేత అయిన బీఎల్‌ సంతోష్‌ను ఇరికించి, నోటీసులివ్వడం ద్వారా కేసీఆర్‌ సర్కార్‌ తమతో పెట్టుకుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని  అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్‌ పరివార్‌ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్‌కు ఇప్పటి వరకూ కవచంలా ఉన్నా తెలంగాణ సెంటిమెంట్ కూడా కేసీఆర్‌ కూడా బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో బలహీనపడడంతో ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ఆరెస్సెస్ వ్యూహకర్తలు సందేశం పంపుతున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సంఘ్‌ పరివార్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్‌ జాతీయ నేతలు సమాలోచనలు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 


ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రత్యేక వ్యూహాల్ని అమలు చేసే ఆరెస్సెస్!


బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలో విజయం సాధించినా.. ఆరెస్సెస్ పాత్రను ఎవరూ కాదనలేరు. పైకి కనిపించకుండా .. ఇంటింటి ప్రచారం చేస్తూ.. బీజేపీకి ఓటర్లుగా మార్చడంలో వీరి పాత్ర కీలకం. త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే దానికి కారణం ఆరెస్సెస్ ఏళ్ల తరబడి ప్రణాళికాబద్దంగా పని చేయడమేనని రాజకీయవర్గాలు నమ్ముతాయి. ఈసారి తెలంగాణలో బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరెస్సెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆరెస్సెస్ ఓ నివేదిక రెడీ చేసుకుందంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని తెలంగాణ బీజేపీకి రూట్ మ్యాప్ అందినట్లుగా చెబుతున్నారు. 


మునుగోడు ఉపఎన్నికల తరహా పరిస్థితి రాకూడదని ఆరెస్సెస్ దిశానిర్దేశం  ! 


మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆరెస్సెస్ విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్‌ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని అంతిమంగా తీర్మానించారు. ఇప్పుడు బీజేపీ బహిరంగంగా రాజకీయంగా పోరాడుతుంది. ఆరెస్సెస్ మాత్రం చాపకింద  నీరులా తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నించనుంది. తెలంగాణలో ఆరెస్సెస్ శాఖలు  బలంగానే ఉన్నాయి. అయితే లేకపోయినా ఆరెస్సెస్ సభ్యులు.. తమకు కేటాయించిన చోటే ఉండి.. పరిస్థితుల్ని చక్కదిద్దడంలో నిష్ణాతులుగా ఉంటారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ బీజేపీతో పాటు ఆరెస్సెస్‌తోనూ పోరాడాల్సి ఉంది.