Modi Tour Matters :    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం విశాఖలో... సాయంత్రం రామగుండంలో ఉంటారు. ఒకే కార్యక్రమంలో పలు అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ రెండు పర్యటనలూ అధికారికమే. కానీ రాజకీయం కూడా ఉంది. బీజేపీ రాజకీయాల సంగతి పక్కన పెడితే మోదీని రెండు తెలుగు రాష్ట్రాలు రిసీవ్ చేసుకుంటున్న విధానంలోనే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో అధికార పార్టీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతోంది. కానీ తెలంగాణలో మాత్రం సమరానికి సై అంటోంది. కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. 


ఏపీలో మోదీ కోసం వైఎస్ఆర్‌సీపీ హడావుడి !


తెలుగుదేశం పార్టీ హయాలంో చివరి ఏడాదిలో ప్రధాని హోదాలో మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారంటే.. అలజడి రేగేది. ఆ రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు అలా ఉండేవి. విభజన సమస్యలపై అప్పుడూ ఇప్పుడూ మార్పు లేదు. నిజం చెప్పాలంటే.. చాలా సమస్యలు లాగే ఉండిపోయాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం మోదీ మన రాష్ట్రానికి రావడమే మహద్బాగ్యం అన్నట్లుగా  ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం స్వయంగా బహిరంగసభ నిర్వహిస్తోంది. రాజకీయాలకు అతీతమైన సభ అని... రాష్ట్రానికి మోదీ కొన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన సభ కోసం మూడు లక్షల మందిని సమీకరించి.. మోదీ వద్ద మార్కులు పొందడానికి వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడుతున్నా.. వారిని పోలీసులు అణిచి వేస్తున్నారు. 


తెలంగాణ మోదీ పర్యటనపై టీఆర్ఎస్ చిటపటలు !


విశాఖ నుంచి సాయంత్రం సమయంలో రామగుండం చేరుకునే ప్రధాని మోదీకి .. టీఆర్ఎస్ తరపున తెలంగాణ ఎలాంటి ఏర్పాట్లు లేవు. అసలు మోదీ పర్యటనను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. స్వయంగా కేసీఆర్ కూడా ఆయనకు స్వాగతం చెప్పందుకు సిద్ధంగా లేరు. ఆయన ఢిల్లీ వెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది.  ఇప్పటికే కేసీఆర్ ను.. ప్రధాని మోదీ ప్రాపర్‌గా పిలవలేదని టీఆక్ఎస్ వాదిస్తోంది. కారణం ఏదైనా ఇప్పుడు రామగుండంలో మోదీ పర్యటన పూర్తి స్థాయిలో ఏకపక్షంగా జరుగుతోంది.  బీజేపీ నేతలు మాత్రమే ఏర్పాట్లు చూసుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం పర్యటనను అడ్డుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. మోదీ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇచ్చి రావాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీంతో మోదీ పర్యటన రోజు ఉద్రిక్తతలు ఖాయంగా కనిపిస్తున్నాయి. 


తెలుగు రాష్ట్రాల భిన్న వైఖరి ఎందుకు ?


విభజన సమస్యలు రెండు రాష్ట్రాల్లోనూ అపరిష్కతంగా ఉన్నాయి. ఇదే ఎజెండా అయితే రెండు రాష్ట్రాలు ప్రధాని్ మోదీని నలదీయాలి. కానీ తెలంగాణలో మాత్రం ఆయనకు సెగ తగలే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు ఇలా పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నది ఊహకు అందని విషయం.  టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ.. బీజేపీపై పోరాటం విషయంలో మాత్రం వారు ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. బీజేపీని వైసీపీ సమర్థిస్తోంది..బహుశా.. ఏపీలో ఆ పార్టీ తమకు ధ్రెట్ కాదని భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.