Ippatam Politics :  గ్రామాల్లో అంతర్గత రోడ్లు 40 అడుగులు ఉంటే చాలనుకుంటాం. కానీ ఇప్పటంలో 120 అడుగుల రోడ్లేస్తామని ఇళ్లు కూల్చేయడం ఇప్పుడు రాజకీయాలను మలుపు తిప్పింది. ఇప్పటం గ్రామానికి వచ్చే రోడ్ల నలభై, యాభై అడుగులు ఉండవు. ఇక లోపల మాత్రం అంత పెద్ద రోడ్లేస్తారని ఎవరూ అనుకోరు. ఇప్పటికీ వేస్తారని అనుకోవడం లేదు. ఇప్పటికైతే ఆ మేరకు రోడ్డు స్థలాన్ని కూల్చేశారు. వేస్తారో లేదో తర్వాత సంగతి కానీ ఇప్పటికైతే రాజకీయం రాజుకుంది. వైఎస్ఆర్‌సీపీ చిక్కుల్లో పడింది. 


రాజకీయాల్ని మలుపు తిప్పిన ఇప్పటం కూల్చివేతలు !


ఇప్పటం. ఈ గ్రామం పేరు గత ఎన్నికలప్పుడు ఎవ్వరీకీ తెలయదు. కానీ ఈ సారి జరగబోయే సాధారణ ఎన్నికల సమయానికి కల్లా ఇప్పటమే కేంద్ర బిందువుగా రాజకీయాలు జరిగే పరిస్థితి వస్తుందా? అనిపిస్తోంది. జనసేనాని పుణ్యమానికి ప్రపంచానికి ఇప్పటం గ్రామం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఇప్పటం గ్రామం తెలియని వారు ఉండరేమో? అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ గ్రామం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. తాజాగా స్థానిక ఎమ్మెల్యే అర్కె గురించే అంతా చర్చించుకుంటున్నారు. మొన్న పవన్‌ కల్యాణ్‌ నిన్న నారా లోకేష్‌ ఇలా విపక్ష నేతలందరూ ఇప్పటం గ్రామానికి వెళ్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రతిగా అధికార పార్టీ సమాధానమిచ్చినా ఇప్పటివరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం నోరుమెదపకపోవడమే కాదు ఎక్కడనున్నాడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకిలా ఆర్కే ఆమడదూరంలో ఉన్నారు అన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 


ఇప్పటం గ్రామం వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే ఆర్కే ! 


మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం ప్రస్తుతం రాజకీయాలకు వేదికగా మారింది. ఇళ్ల కూల్చివేత విపక్షాలకు ఆయుధంగా మారింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి జగన్‌ పాలనపై విరుచుకుపడ్డారు. బాధితులతో కలిసి శాపనార్థాలు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా అధికారపార్టీ కూడా సమాధానమిచ్చింది. ఈ వివాదం ఇంకా సద్దుగణకముందే టిడిపి నేత నారాలోకేష్‌ ఇప్పటం గ్రామానికి రావడంతో మరోసారి రాజకీయ హీటు పెరిగింది. రాసుకోవడానికే తప్ప చేతల్లో ఎక్కడా ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని నారా లోకేష్‌ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై టిడిపి చేస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటం గ్రామానికి వచ్చిన లోకేష్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లోని  ప్రతీ పథకం గోవిందా గోవిందా అని సెటైర్లు వేశారు. అంతటితో ఆగలేదు అసలు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడంటూ ప్రశ్నించారు. గతంలో ఇప్పటం గ్రామస్తులకు ఆర్కే ఇచ్చిన హామీని మర్చిపోవడం వల్లే ఇప్పుడు వీరంతా రోడ్డు మీదకొచ్చారన్నారు. అంతేకాదు నియోకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో గ్రామసభ  ద్వారా చర్చలకు సిద్ధమా అని మంగళగిరి ఎమ్మెల్యేకి సవాల్‌ విసిరారు. దీంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడన్న చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఇప్పటం వివాదంపై ఆర్కే  మాట్లాడలేదు. ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. 


నియోజకవర్గంలో పెద్దగా కనిపించని ఆర్కే ! 


అసలింతకీ ఆర్కే ఎక్కడని చర్చించుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆర్కే అన్నింటికి దూరంగా ఉంటున్నారు. వైఎస్‌ హయాంలో ఆయనకు మంచి పలుకబడి ఉండేది. కానీ జగన్‌ తో టచ్‌ మీ నాట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్‌ ఉంది. అంతేకాదు మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారిలో ఆర్కే కూడా ఉన్నారన్న వాదన ఉంది. అందుకే వైసీపీకి దూరంగా ఉండడమే కాదు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదని ఇన్‌ సైడ్‌ టాక్. ఇంకోవైపు ఇప్పటం గ్రామస్తులకు జనసేన అధినేత రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ తరపున   లోకేష్‌ హామీలతో సరిపెట్టారు. 2024లో  అధికారంలోకి వచ్చాక ఇప్పటం గ్రామస్తులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె గడప గడప కు ప్రొగ్రాంలో బాగా బిజీగా ఉన్నారనీ, ఆయన తొందర్లోనే ఇప్పటం గ్రామాన్ని సందర్శిస్తారని వైసీపీ నేతలు చెబతున్నారు. ఇప్పటం గ్రామాన్ని రాజకీయంగా అన్నీ రాజకీయపార్టీలు వాడేసుకుంటున్నాయని టాక్ మాత్రం బాగా విన్పిస్తుంది. ఇప్పటం ప్రభావం ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఎలా ఉంటుంది అనేది రేపుఎన్నికల్లో తేలనుంది. 


డ్యామేజ్ కవరింగ్‌కు వైసీపీ ప్రయత్నాలు !


కూల్చివేతలతో ఇబ్బందేనని వైఎస్ఆర్‌సీపీ గుర్తించింది. అందుకే ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కూల్చలేదనే వాదనను ఎక్కువగా వినిపిస్తున్నారు. చివరికి ప్రభుత్వం మా ఇళ్లు కూల్చలేదనే ఫ్లెక్సీలను ఇప్పటంలో కూల్చి వేసిన ఇళ్ల ముందు పెట్టారు. అయితే... ఇప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగిందన్నది వైఎస్ఆర్‌సీపీ వర్గాల అంతర్మథనం.