AP Poltics Telangana CS : తెలంగాణ చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి ఎన్నికయ్యారు. ఆమె పేరు చాలా అనూహ్యంగా తెరపైకి వచ్చింది.కేసీఆర్ ఆలోచనలు ఏమిటన్నది చాలా మందికి అర్థం కాలేదు. కానీ శాంతి కుమారి ఎంపిక వెనుక ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయాలన్న ఆలోచన ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే రెండు రోజులుగా పరిణామాలు చోటు చోటు చేసుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు శాంతి కుమారి ఎంపికకు.. ఏపీ రాజకీయాలుక సంబంధం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది.
మచిలీపట్నం, కాపు సామాజికవర్గం - శాంతి కుమారికి కలిసొచ్చిన అంశాలా ?
తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఏపీలోని మచిలీపట్నానికి చెందిన వారు. ఆమె కాపు సామాజికవర్గమని తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంలో పెద్దగా కీలక బాధ్యతల్లో ఉన్నట్లుగా కనిపించని శాంతికుమారి అనే సీనియర్ ఐఏఎస్ అఫీసర్ సీఎస్ అయిపోయారు. అసలు ఆమెను ఎంపిక చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆర్థిక శాఖ చూస్తున్న రామకృష్ణారావు కేసీఆర్‌కు చాలా దగ్గర. ఆయనే సీఎస్ అవుతారనుకున్నారు. కానీ కేసీఆర్ శాంతి కుమారిని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ లో కలిశారు. వారితో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆ ఫోటో కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కూడా కేసీఆర్ ను కలిశారు. వీరిద్దరూ ఐఏఎస్ బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవలి వరకూ వీరిద్దరూ జనసేనలోనే ఉన్నారు.
కేసీఆర్ ను కలిసిన సమయంలో శాంతి కుమారి కూడా ఉన్నారు !
శాంతి కుమారితో పాటు వీరు కూడా కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లడానికి కారణం... కాపు కోణమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో కాపు సామాజికవర్గంపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ కోణంలోనే ఆమెను సీఎస్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు. అందుకే ఆ వెంటనే ఏపీ కాపు బీఆర్ఎస్ నేతల్ని ప్రగతి భవన్‌కు ఆహ్వానించారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఉండాలంటే.. ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారంటున్నారు. ఈ కారణంగా కాపు సామాజికవర్గంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారని అంటున్నారు. ఈ కోణంలోనే రాజకీయం కూడా జరుగుతోందని అంటున్నారు.
అనూహ్యంగా శాంతి కుమారిని అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ !
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి నియామకం కావడం సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ నియామకాల గురించి చిరంజీవి ట్వీట్ చేయరు. ఈ ట్వీట్ వెనుక కూడా రాజకీయం ఉందని భావిస్తున్నారు.
ఉన్నతాధికారుల నియామకాల్లోనూ ఇక సామాజిక కోణమే కీలకంకనుందా ?
ఇలాంటి సమీకరణాల వల్ల ఎంత లాభం వస్తుందో కానీ.. అధికారవర్గాల్లో మాత్రం గతంలో మంత్రి పదవులు మాత్రమే సామాజిక సమీకరణాలు చూసేవారని..ఇప్పుడు అధికారుల్లోనూ చూస్తారన్న చర్చ జరుగుతోంది. శాంతి కుమారిని కేవలం సామాజిక కోణంలోనే ఎంపిక చేసి ఉంటే మాత్రం... రాజకీయం కొత్త పుంతలు తొక్కుతున్నట్లేనని రాజకీయవర్గాలు గట్టి నిర్ణయానికి వచ్చేస్తాయనడంలో సందేహం లేదు.