AP Cabinet changes:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ప్రదర్శిస్తున్న అసహనం కేవలం పరిపాలనాపరమైన కోపమే కాకుండా, రాబోయే భారీ రాజకీయ మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ముఖ్యంగా ఇటీవలి కేబినెట్ సమావేశంలో  కేబినెట్ అజెండా మీడియాకు లీక్ అవ్వడంపై ఆయన స్పందించిన తీరు, మంత్రుల పనితీరుపై ఆయన ఇస్తున్న రేటింగ్స్.. త్వరలోనే ఏపీ మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయనే అంచనాలను బలపరుస్తున్నాయి 

Continues below advertisement

 మంత్రివర్గ ప్రక్షాళన దిశగా అడుగులు?  

సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో, అజెండాలోని కీలక అంశాలు అధికారికంగా వెల్లడించక ముందే మీడియాలో రావడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ఎన్టీఆర్ హయాంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. బడ్జెట్ వివరాలు లీక్ అయినందుకు ఎన్టీఆర్ మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ..  గోప్యత పాటించలేని మంత్రులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత  అని నిలదీశారు. ఇది మంత్రులకు ఇచ్చిన ఆఖరి హెచ్చరికగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Continues below advertisement

రెండేళ్ల కాలపరిమితి - పనితీరుకు పరీక్ష

చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది . సాధారణంగా చంద్రబాబు తన గత అనుభవాల దృష్ట్యా, ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకునే సమయానికి మంత్రుల పనితీరుపై ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేస్తారు. ప్రస్తుతం మంత్రుల గ్రాఫ్, ప్రజల్లో వారి ఇమేజ్, శాఖలపై పట్టు వంటి అంశాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు. ఎవరైతే ఆశించిన స్థాయిలో పని చేయడం లేదో, వారిని తప్పించి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల టార్గెట్ - కొత్త టీమ్ సిద్ధం?

రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బాబు, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు సమర్థులైన నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. కేబినెట్ అజెండాను కూడా ముందస్తుగా చదువుకోకుండా వస్తున్న మంత్రులపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సమయానికి ప్రజల్లో మంచి మైలేజ్ ఉన్న నేతలతో కూడిన కొత్త టీమ్ ను రంగంలోకి దించే అవకాశం ఉంది.అజెండా కాపీలు ఎవరు లీక్ చేస్తున్నారో, ఏ మంత్రులు మీడియా ప్రతినిధులతో అతిగా సాన్నిహిత్యం నెరుపుతున్నారో తనకు తెలుసని చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఇది మంత్రులలో ఒక రకమైన భయాన్ని కల్పించింది. కేవలం లీకులే కాకుండా, శాఖా పరమైన నిర్ణయాల్లో జాప్యం, కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం వంటివి కూడా బాబు అసహనానికి కారణమయ్యాయి.

 సమీకరణాల మార్పు - లోకేష్, పవన్ ప్రభావం

ఈసారి మంత్రివర్గ మార్పుల్లో నారా లోకేష్ మార్క్, అలాగే కూటమి ధర్మం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలు కూడా కీలకం కానున్నాయి. యువ నేతలకు ప్రాధాన్యత పెంచడం, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వంటి అంశాల ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక ఉండవచ్చు. పనితీరు బాలేని సీనియర్లను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసి, చురుకైన వారిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం మెండుగా ఉంది. చంద్రబాబు సీరియస్ లుక్ వెనుక ఒక పెద్ద  క్లీనింగ్ ప్రాసెస్  దాగి ఉందని అర్థమవుతోంది. పరిపాలనలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా తప్పిస్తాననే సందేశాన్ని ఆయన బలంగా పంపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే లేదా రెండేళ్ల పాలన ముగిసిన వెంటనే ఏపీ కేబినెట్‌లో భారీ మార్పులు జరగడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు.