Telangana Congress  :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  సీట్ల కసరత్తు ప్రారంభం కావడంతో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. బహిరంగంగా ఇంకా పెద్ద పెద్ద ఘటనలేమీ జరగలేదు కానీ అంతర్గతంగా మాత్రం.. ఆ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లువెత్తుతోంది. పార్టీ తరపున అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సెగలు రేపింది. ఇందులో ప్రధానమైన సమస్య కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తారా రెండు టిక్కెట్లు ఇస్తారా అన్నదే. కొంత మంది కీలక నేతలు తమ కుటుంబాలకు రెండు టిక్కెట్లు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న షరతు ఉంది. దీంతో తమ స్థాయిలో తాము ఒత్తిడి తెచ్చేందుకు ఆయా నేతలంతా రెడీ అయ్యారు. అందుకే తొలి సమావేశమే వేదిక అయింది. 


నల్లగొండలో ఉత్తమ్, జానా ఫ్యామిలీలకు సెపరేట్ రూల్స్ ఉంటాయా ?


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తనకు, తన భార్య పద్మావతికి టిక్కెట్లు ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ పద్మావతి కోదాడ మాజీ ఎమ్మెల్యే. అక్కడ్నుంచి మళ్లీ తాను పోటీ చేస్తానని టిక్కెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక హుజూర్ నగర్ నుంచి తాను మళ్లీ పోటీ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత జానారెడ్డి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు కానీ ఆయన ఇద్దరు కుమారులు ఒకరు మిర్యాలగూడ, మరొకకరు నాగార్జున సాగర్ టిక్కెట్ కావాలని కోరుకంటున్నారు. వీరు పార్టీలో చాలా సీనియర్ నేతలు. 


ఇతర జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల డిమాండ్ అదే ! 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇతర జిల్లాల సీనియర్ల డిమాండ్ కూడా రెండు టిక్కెట్ల దగ్గర ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ .. తనతో  పాటు తన కుమార్తెకూ సీటు అడుగుతున్నారు. బలరాం నాయక్ తన కుమారుడికి టిక్కెట్ అడుగుతున్నారు. దరఖాస్తు కూడా చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న సీతక్క కూడా తన కుమారుడికి సీటు అడుగుతున్నారు. ఆమె కుమారుడు సూర్యం ఇప్పటికే చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండా సురేఖ కూడా ఈ సారి వరంగల్ తోపాటు.. పాలకుర్తి కూడా తన కుటుంబానికి కేటాయించాలని  దరఖాస్తు చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా అదే కోరుతున్నారు. 


పార్టీలో చేరని వారి డిమాండ్లు కూడా అలాంటివే !


విచిత్రం ఏమిటంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలే కాదు.. పార్టీలో ఇంకా చేరని వారు కూడా రెండు టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ కూడా టిక్కెట్ అడుగుతున్నారు. ఇద్దరిలో ఒకరికి కాదు..ఇద్దరికీ ఇవ్వాలంటున్నారు. ఇక ఇంకా పార్టీలో చేరని.. చేరుతారో లేదో తెలియని మైనంపల్లి హన్మంతరావు ప్రధాన డిమాండ్ కూడా అదే. ఆయనతో పాటు ఆయన కుమారుడికి మెదక్ టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది. లేకపోతే ఆయన పార్టీలో చేరే అవకాశం ఉండదు. 


ఉదయ్  పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ 


కాంగ్రెస్ పార్టీ గతంలో ఉదయ్ పూర్ లో నిర్వహించిన ప్లీనరీలో ఒక కుటుంబానికి ఒక్క టిక్కెటే కేటాయించాలని తీర్మానించారు.  ఇప్పుడు ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కటే కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక్కటే కేటాయిస్తే.. కొంత మంది నేతలు అలగడం ఖాయం. ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది.