MLAs In Under Ground : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పెషల్. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఎప్పుడైనా బయటకు రావాలంటే వారు కేసీఆర్‌తో పాటు వస్తున్నారు. వెళ్తున్నారు. నియోజకవర్గాలకూ వెళ్లడం లేదు. ప్రభుత్వం వారికి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇళ్ల దగ్గర కూడా సెక్యూరిటీ పెంచింది. కానీ వారిని ఎందుకు ఇంకా కేసీఆర్ రక్షణలో ఉంచుతున్నారు ? అసలేం జరుగుతోంది ?


నలుగురు ఎమ్మెల్యేల్ని రక్షణలో ఉంచిన కేసీఆర్ !
 
పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లే.  కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వారు బయట కనిపించడం అరుదైపోయింది. కనిపిస్తే కేసీఆర్‌తోనే కనిపిస్తున్నారు. ఫామ్‌హౌస్ డీల్స్ వ్యవహారంలో పోలీసులు ఎంటరైన తర్వాత నలుగురు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆ తరవాత వారికి భద్రత పెంచారు. కానీ నియోజకవర్గాలకు మాత్రం వెళ్లడంలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నారని చెబుతున్నారు కానీ ఎలాంటి కార్యక్రమాలకు  హాజరు కావడం లేదు. బయట కనిపిస్తే మాత్రం కేసీఆర్‌తోనే వస్తున్నారు.  మునుగోడు ఉపఎన్నిక ముగిసిన రోజున కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ వచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ప్పుడు మరోసారి వారు టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి వచ్చారు. అయితే వారు ఎవరికి వారుగా రాలేదు. కేసీఆర్ కాన్వాయ్‌లోనే నలుగురూ వచ్చారు.


ఇంకా ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారా ? ఫామ్‌హౌస్‌లోనా ?


ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. ఇళ్లకూ వెళ్లడం లేదు. పూర్తిగా కేసీఆర్ సంరక్షణలోనే ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రగతి భవన్‌లో ఉంటున్నారని కొంత మంది.. కాదు .. ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని కొంత మంది చెబుతున్నారు. కానీ ఎక్కడో చోట ఉంటున్నామని.. ఇంటలిజెన్స్ నివేదికల మేరకే ఉంటున్నామని.. తమకు ముప్పు ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.  తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు  ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. రోహిత్ రెడ్డి వద్ద సిట్ అధికారులు స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు. 


ఈ నలుగురు బయటకు వస్తే వచ్చే ఇబ్బందేంటి ?


ఈ నలుగురు ఎమ్మెల్యేలే స్వేచ్చగా బయట తిరిగితే ఏమవుతుందనేది టీఆర్ఎస్ నేతలకు అంతు బట్టడం లేదు. వారిని రహస్యంగా ఉంచడం వల్ల ఏదో దాస్తున్నారన్న అభిప్రాయ కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే ఉంటుంది. సీబీఐ రాకుండా జీవో తీసుకు వచ్చారు. ఇతర దర్యాప్తు సంస్థలు అప్పటికప్పుడు వచ్చి ఆ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. అయినా కేసీఆర్ వారిని రక్షణలోనే ఉంచుతున్నారు. సిట్ దర్యాప్తు  ఓ కీలక దశకు వచ్చే వరకూ వారిని కేసీఆర్ ఆజ్ఞాతంలోనే ఉంచుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏమిటో కానీ.. ఎమ్మెల్యేల ఆజ్ఞాతం మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే కాదు.. ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.