TRS To BRS : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది. శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన "భారత రాష్ట్ర సమితి" ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖను ఆమోదిస్తూ.. సమాధాన లేఖపై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా కేసీఆర్ పంపిస్తారు. తర్వాత సీఎం కేసిఆర్ గారు బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు.దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు . అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని ఈసీకి పంపించారు. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో ఈసీ అధికారికంగా పేరు మార్పును ఖరారు చేసింది.
21 ఏళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో 21 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న కేవలం వందల మంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, కొందరు మేధావులు తప్ప మెయిన్‌స్ట్రీం రాజకీయ నాయకులు ఎవరూ లేరు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. 13ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణను సాధించారు. ఎనిమిదేళ్ల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి టీఆర్ఎస్ లేని రాజకీయాలు తెలంగాణలో కనిపించనున్నాయి. అందుకే ముందు ముందు జరిగే రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఏర్పడింది. త్వరలో కేసీఆర్ జాతీయ స్థాయిలో బహిరంగసభ పెట్టి... పార్టీ విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.