Shock For Jagan :  ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎన్నుకున్న విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌ప్పు ప‌ట్టింది. ప్ర‌జాస్వామ్యంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు, శాశ్వత పదవులు ఉండబోవని.. ఆ ఎన్నిక చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించింది. అంతా మీ ఇష్ట‌మున్న‌ట్టు చేస్తామంటే కుద‌ర‌ని ఈసీ సీరియ‌స్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం రూల్స్ కు  విరుద్ధమని తెలిపింది. ఈ మేర‌కు వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌ద‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఉత్త‌ర్వులు పంపింది. ఇట్లా చేయడం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని పేర్కొంది ఈసీ. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.


ఇటీవల ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించి మరీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక


ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్‌ను పార్టీ శాశ్వతఅధ్యక్షునిగా ఎన్నుకున్నారు.  ఈమేరకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు.. రఘురామ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా  కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు.  


 గతంలో కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా వ్యవహరించారని వాదించిన విజయసాయిరెడ్డి 


వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలోనే పార్టీపై పూర్తి స్తాయి పట్టు ఉన్న జగన్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారన్న విమర్శలకు ఆ పార్టీ ముఖఅయ నేతలు కౌంటర్ ఇచ్చారు. గతంలో కరుణానిధి కూడా డీఎంకేకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. . ఉత్తర కొరియా, చైనా... దేశాలు అని, అక్కడ శాశ్వత అధ్యక్షులు ఉండడం వేరని, కానీ ఏపీ భారతదేశంలో ఓ రాష్ట్రం అని, ఇక్కడ ప్రజాస్వామ్య రక్షణకు ఓ చట్టం కూడా ఉందని, నిర్దిష్ట ఎన్నికల నియమావళి ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రతి పార్టీ పాటించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారమే జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ చెప్పింది. 


శాశ్వత అధ్యక్షుడిగా నియామకం చెల్లదు కాబట్టి మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాల్సిందే !


పార్టీకి శాశ్వత అధ్యక్షుడ్ని నియమించుకునేలా రాజ్యాంగాన్ని సవరించారు కాబట్టి.. సీఈసీ ఆదేశాల మేరకు ఆ సవరణ కూడా చెల్లదు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని  సవరణను  మళ్లీ తొలగించి.. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ స్థాపకుడు జగన్ కాదు. శివకుమార్ అనే మరో వ్యక్తి.  భవిష్యత్‌లో అతని వద్ద నుంచి సమస్యలు రాకుండా  శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నారన్న వాదన వైఎస్ఆర్సీపీలో వినిపిస్తోంది.