BJP PLenary Plan On TRS : భారతీయ జనతా పార్టీ.. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. దక్షిణాదిన అధికారం చేపట్టే రెండో రాష్ట్రంగా తెలంగాణను నిలపడం, 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అధిష్టానం సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వేదిక చేసింది. ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదని తెలంగాణ బీజేపీ నేతలు పది లక్షల మందితో బహింరంగసభ నిర్వహిస్తున్నారు.
దక్షిణాదిలో పెద్దగా పట్టు లేని బీజేపీ !
2014, 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘన విజయం మొత్తం హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే కాస్త ఫలితం చూపించగలిగింది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 130 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒరిస్సాతో కలిపితే 151 సీట్లు ఉంటాయి. ఈ అన్ని సీట్లలో బీజేపీ కర్ణాటకలో మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. ఇంకెక్కడా కాదు. కానీ ఈ సారి తెలంగాణ కాస్త జోరు పుంజుకుంది. తెలంగాణలో కనీసం ఎనిమిది లోక్ సభ సీట్లును టార్గెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ వ్యూహకర్తలు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక అమలు చేస్తారు. దాని ప్రకారం తమకు చాన్స్ ఉన్న నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ మాత్రం చాన్స్ లేదనుకుంటే.. అక్కడ అసలు పట్టించుకోరు. అక్కడ సమయం.. ధనం వృధా చేసుకోవడాన్ని ఇష్టపడరు.కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ మంచి అవకాశాల్ని చూస్తోంది. అందుకే టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
మోదీ, అమిత్ షాలది అంచనా వేయలేని రాజకీయం !
కార్యవర్గ సమావేశాలను పరిమితంగానే దక్షిణాదిలో నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ బలపడాలని టార్గెట్ పెట్టుకుంటారో అక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వ,్చోంజియ 2015లో కర్ణాటక రాజధాని బెంగళూరులో, 2016లో కేరళలోని కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో మిషన్ సక్సెస్ అయినా.. కేరళలో మాత్రం వర్కవుట్ కాలేదు. శబరిమల ఇష్యూని ఓ రేంజ్‌కు తీసుకెళ్లి... కార్యవర్గ సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సారి మాత్రం తెలంగాణలో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అమిత్ షానే. మోదీతో కలిసి ఆయన చేసే రాజకీయం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారో ఎవరూ చెప్పలేరు.
కార్యవర్గ భేటీ తర్వాత అసలు కార్యచరణ
జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో పెట్టడం అంటేనే బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాజకీయంగా ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుందని సులువుగా అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. దక్షిణాదిన తాము అధికారం చేపట్టే రెండో రాష్ట్రం తెలంగాణ అవుతుందని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. మరి అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తుందా.. తెలంగాణ బీజేపీ నేతలు.. అమిత్ షా, మోదీ స్పీడ్ అందుకుంటారా లేదా అన్నది కాలమే తేల్చాలి !