Telangna Elections 2023 BRS Tour Plans :    భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ ( Congress ) మాటే వినిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ లేదా  మరి ఎవరైనా సరే  పదే పదే కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తున్నారు.  కాంగ్రెస్ గెలిస్తేఏదో జరిగిపోతుందని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.   కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుందని ప్రజల్ని భయపెట్టేందుకు కేసీఆర్ ( KCR )  ప్రయత్నిస్తున్నారు.   ఇందు కోసం  ఆయన నేరుగా కాంగ్రెస్ గెలిస్తే అనే పదం వాడేస్తున్నారు. కేటీఆర్ కూడా అంతే. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఈ విధంగా వ్యతిరేకత పెంచితే..బీఆర్ఎస్‌కు  మేలు జరుగుతుందాద?


కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే  వ్యూహం !  
 
కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తే ప్రజలు తమకే ఓట్లేస్తారన్న వ్యూహాన్ని  బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏదో  జరిగిపోతుందని కరెంట్ రాదని..  పథకాలు ఆగిపోతాయని.. పరిశ్రమలు తరలి పోతాయని చెప్పాల్సినదంతా చెబుతున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి  .. చంద్రబాబు మనిషని కూడా పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  రేవంత్ పై.. కాంగ్రెస్‌పై తెలంగాణ వ్యతిరేకం ముద్ర వేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.    నేరుగా కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందన్న  భయం కల్పించడానికి బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నం  చేస్తున్నారు.   ప్రచారసభల్లో హైలెట్ చేస్తున్నారు.   కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  కర్ణాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారని.. అక్కడ హామీలు ఏమీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అందు కోసం కొంత మందిని రైతుల పేరుతో తెలంగాణ నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయించారు.   ఈ క్రమంలో  డీకే శివకుమార్ రాసినట్లుగా చెబుతున్న లేఖను వైరల్ చేయడంతో దుమారం రేగింది.  హైదరాబాద్‌లో ఫాక్స్ కాన్ పెట్టిన యాపిల్ ఉత్పత్తుల పరిశ్రమను బెంగళూరుకు తరలించలని ఓ లేఖ  రాసినట్లుగా బీఆర్ఎస్ నేతుల ప్రచారం ప్రారంభించారు. ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కాంగ్రెస్ గెలవక ముందే  హైదరాబాద్ పరిశ్రమల్ని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక గెలిస్తే.. హైదరాబాద్ ను ఖాళీ చేసి బెంగళూరుకు తరలిస్తారని ఆరోపించడం ప్రారంభించారు. చివరికి కేటీఆర్ కూడా ఆ లేఖను  ప్రదర్శించారు.  చివరికి ఈ లేఖ విషయం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు చేరింది. తాను అటువంటి లేఖ  ఫాక్స్ కాన్ కంపెనీకి రాయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు సర్క్యూలేట్ చేస్తున్న లేఖ ఫేక అని దానిపై బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు.  


కాంగ్రెస్‌కు సానుభూతి రాకుండా ప్రయత్నమా ?


కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని రాజకీయవర్గాలు విశ్లేషించడం లేదు.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గుర్తుంచుకుంటున్నారు.    ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలు బాగానే అమలయ్యాయి. రేషన్ కార్డులు, పించన్లు అడిగిన వారందరికీ ఇచ్చారు.  తెలంగాణ ఇచ్చి పార్టీ నష్టపోయిందన్న భావనలో కొంత మంది సానుభూతిపరులు ఉన్నారు. కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోవడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్.  ఇప్పుడు స్వయంగా కేసీఆర్ తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయినా ఆయన పరిస్థితిని గమనించి తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే బలమని... తన పార్టీని జాతీయ పార్టీగా మార్చలేదన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.   చివరికి  తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని..  అందరం కలిసి ఉద్యమం చేస్తే తప్పని సరి పరిస్థితుల్లో ఇచ్చిందని వాదిస్తున్నారు 
 
గెలుస్తామని బీఆర్ఎస్సే ప్రచారం చేస్తోందంటున్న కాంగ్రెస్ 


కేసీఆర్, కేటీఆర్ మాటలతో...  కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని అంగీకరించినట్లయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.  కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకుంటున్న వారిని.. ఆ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని భయ పెట్టి ఓటు వేయకుండా చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారని ... ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని అంటున్నారు. నమ్ముతారో లేదో.. డిసెంబర్ మూడో తేదీన క్లారిటీ వస్తుంది.