Political language of Telangana: తెలంగాణ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం విమర్శల స్థాయిని దాటి, వ్యక్తిగత దూషణలు ,కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే తిట్ల పురాణం గా మారిపోయింది. ఒకప్పుడు సిద్ధాంతాలు, అభివృద్ధి ప్రాతిపదికన సాగే చర్చలు ఇప్పుడు కర్ణకఠోరమైన భాషా ప్రయోగాలకు వేదికవుతున్నాయి. రాష్ట్రంలోని అగ్రనేతలు మొదలుకొని సోషల్ మీడియా కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ హుందాతనాన్ని విస్మరించి రాజకీయ సంస్కృతిని రోజు రోజుకు బలహీనపరుస్తున్నారు.
2014-19 మధ్య కాలంలో ఏపీలో తిట్ల రాజకీయాలు
ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న ఈ ధోరణి గతంలో ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తోంది. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల మధ్య సాగిన వ్యక్తిగత దూషణలు, మహిళా నేతల ప్రస్తావన, కుటుంబ సభ్యులను కించపరచడం వంటివి ప్రజల్లో తీవ్ర అసహ్యాన్ని కలిగించాయి. రాజకీయ పోరాటాలు కేవలం అసెంబ్లీలోనో, ప్రజాక్షేత్రంలోనో ఉండాల్సింది పోయి ఘోరంగా తిట్టుకోవడానికి వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు వాడుతున్న భాష అత్యంత దారుణంగా ఉంటోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, మాజీ మంత్రులు సైతం గుడ్లు పీకుతాం, పేగులు మెడలో వేసుకుంటాం, చెప్పులతో కొడతాం వంటి భాషను వాడుతున్నారు. నాయకులే ఇలాంటి భాషను వాడుతుంటే, వారిని అనుసరించే ద్వితీయ శ్రేణి నేతలు , సోషల్ మీడియా సైన్యం మరింత రెచ్చిపోతున్నారు. ఫోటో మార్ఫింగ్‌లు, వ్యక్తిత్వ హననం వంటివి నిత్యకృత్యంగా మారాయి.
కుటుంబసభ్యులనూ ప్రస్తావిస్తూ విమర్శలు
ఈ రాజకీయ యుద్ధంలో ఎవరికీ సంబంధం లేని కుటుంబ సభ్యులను, పిల్లలను, వివాదాల్లోకి లాగుతున్నారు. . ఒక నాయకుడి వైఫల్యాన్ని ఎండగట్టడానికి ఆయన పాలనను లేదా నిర్ణయాలను విమర్శించాలి కానీ, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుకు లాగడం వల్ల రాజకీయాల్లోకి వచ్చే కొత్త తరానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్.. సీఎం రేవంత్ సతీమణి గీత ప్రస్తావన తెచ్చారు. రేవంత్ రెడ్డిని ఆమె కట్టేయాలని లేకపోతే బయటకు వచ్చి అందర్నీ కరుస్తారని కేటీఆర్ అన్నారు. రేపు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సతీమణి ప్రస్తావన తీసుకు వచ్చి విమర్శిస్తారు. ఇలా ఇంట్లో వారిని కూడా రాజకీయాల్లోకి తెచ్చేసుకునేలా విమర్శలు ఉంటున్నాయి.
ఈ తిట్ల రాజకీయానికి దూరంగా బీజేపీ !
ఈ తిట్ల రాజకీయానికి బీజేపీ దూరంగా ఉంటోంది. కేంద్రమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న తిట్ల వర్షాన్ని ఖండించారు. తెలంగాణలో ఇప్పుడు మాటల విరేచనాలు జరుగుతున్నాయని.. అభివృద్ధి గురించి మాటలు లేవు...జవాబుదారీతనం లేదని అసంతృప్తి వ్యక్తం చే్తున్నారు. నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడటం మానేసి ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించినప్పుడు, వారు పాలనపై చూపించడానికి ఏమీ లేదనితెలుస్తుందన్నారు. తెలంగాణకు ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతు మద్దతు , మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు అవసరం. అధికార పార్టీ ,ప్రతిపక్షాల మధ్య రోజువారీ తిట్లు అవసరం లేదన్నారు.
ప్రజలు మౌనంగా గమనిస్తూ ఉంటారు !
రాజకీయ నాయకులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ప్రజలు ఈ సర్కస్‌ను మౌనంగా గమనిస్తున్నారు. రాజకీయాలంటే కేవలం తిట్టుకోవడం మాత్రమే అని భావిస్తే, అది ప్రజల్లో నాయకత్వం పట్ల అసహ్యాన్ని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది. ఏపీలో జరిగిన తిట్ల రాజకీయాలను అంతిమంగా ప్రజలు తిరస్కరిస్తారు. అధికారం శాశ్వతం కాదు, కానీ రాజకీయాల్లో ఒక నేత సంపాదించుకునే గౌరవం ఆయన వాడే భాష, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ అది నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ఉండాలి. నాయకులు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. లేనిపక్షంలో, తెలంగాణ సాధించిన స్ఫూర్తి ,రాష్ట్ర అస్తిత్వం ఇటువంటి నీచమైన రాజకీయాల వల్ల మసకబారే ప్రమాదం ఉందిన్న ఆందోళన వ్యక్తమవుతోంది.