Controversy over defecting MLAs: తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలు ఇప్పుడు ఒక ‘జోక్’గా మారిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ప్రలోభాలకో , వ్యక్తిగత ప్రయోజనాలకో తలొగ్గి పార్టీలు మారడం పరిపాటిగా మారింది. అయితే, ఈ ఫిరాయింపుల కంటే దారుణమైన విషయం ఏమిటంటే.. తాము పార్టీ మారలేదని, ఇంకా పాత పార్టీలోనే ఉన్నామని ఆయా నాయకులు బుకాయించడం. ప్రజల కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఆడుతున్న ఈ దేవతా వస్త్రాల నాటకం రాజకీయ పతనానికి పరాకాష్టగా నిలుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
స్పీకర్ నిర్ణయం - విస్మయకర వాస్తవాలు
పదిమంది ఎమ్మెల్యేలు కండువా మార్చి కాంగ్రెస్‌లో చేరిన విషయం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుసు. వారు కాంగ్రెస్ వేదికలపై కనిపించారు, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. రాజకీయంగా ఆ పార్టీ విజయం కోసం పని చేశారు. కానీ, సాంకేతిక అంశాలను సాకుగా చూపిస్తూ వారెవరూ పార్టీ మారలేదని స్పీకర్ కార్యాలయం ప్రకటించడం సామాన్య ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ వంటి వారు కూడా పార్టీ మారలేదని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహసించడమేనన్న అభిప్రాయం సహజంగానే వస్తోంది. చట్టంలోని లొసుగులను వాడుకుని అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు కానీ, ప్రజా కోర్టులో ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న వస్తోంది.
పటాన్‌చెరు పరిణామం - అసలైన అసమ్మతి
ఈ ఫిరాయింపుల పర్వంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం మరో ఆసక్తికర మలుపు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, స్థానిక నాయకత్వం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకత, పార్టీలో ఇమడలేక పోవడం వంటి కారణాలతో ఆయన మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే సమస్య మాత్రమే కాదు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ , ఓటర్ల మనోభావాలను అధికార పార్టీ ఎంతలా విస్మరిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అనుకోవచ్చు. జగిత్యాలలోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఫిరాయింపులు ఉన్న అన్ని చోట్లా ఇదే సమస్య.
చట్టం వర్సెస్ నైతికత
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ అనర్హత వేటు చట్టం ఉద్దేశం ఫిరాయింపులను అరికట్టడం. కానీ, నేటి రాజకీయాల్లో ఆ చట్టమే ఫిరాయింపుదారులకు రక్షణ కవచంగా మారుతోంది. మేము పార్టీ మారలేదు, కేవలం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అనే సాకులు నైతికంగా పతనమైన నాయకత్వానికి నిదర్శనం. ధైర్యంగా పార్టీ మారినట్లు చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు, రేపు ఎలా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతారనేది పెద్ద ప్రశ్న. తమ ఓటును వస్తువుగా మార్చి, అంగడిలో సరుకులా పార్టీలను మారుతున్న నేతలను ప్రజలు ఎల్లకాలం సహిస్తారని అనుకోవడం భ్రమ. చట్టం ముందు గెలిచినా, ప్రజల మనసుల్లో వీరు ‘అనర్హులు’గానే ముద్ర పడిపోతున్నారు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీలు కాలక్రమేణా భారీ మూల్యాన్ని చెల్లించుకున్న చరిత్ర మన కళ్లముందే ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ విలువల లేని రాజకీయం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.
