పార్టీ మార్పుపై బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... " నా వ్యక్తిగత సిద్ధాంతం కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించింది" అంటూ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.


" తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా ప్రధాని మోదీకి, అమిత్ షాకి ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంతో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను. నేను కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బీజేపీ పార్టీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతాం" అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు పదనెక్కుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల కథనరంగంలో దిగిపోగా పాలమూరులోని ప్రధాని నరేంద్ర మోడీ సభలో బిజెపి సైతం ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. ఎన్నికల టార్గెట్గా తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ హామీల వర్షం కురిపిస్తూనే... బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల దాడికి దిగారు. దీంతో ఇక రాష్ట్రంలో కమలం దూకుడు ఖాయం అనుకునే లోపు బిజెపిలోని వర్గం వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


బిజెపిలో ప్రధాని నరేంద్ర మోడీ సభ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సభలో కనిపించేందుకు నేతలతో సహా కార్యకర్తలు కూడా ఉవ్విల్లురుతుంటారు. అలాంటిది నిన్న జరిగిన మోడీ సభకు బిజెపిలో ముఖ్యమైన నేతలుగా ఉన్న సోయం బాపూరావు, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్ డుమ్మా కొట్టడం కమలం పార్టీలో ప్రస్తుతం కలకలం రేపుతున్నది.


అసంతృప్తి  నేతలు పార్టీ మారుతారా? లేక కొనసాగుతారా? 


ఇటీవల జరుగుతున్న పరిణామాలపై బిజెపిలోని ఓవర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలు బహిరంగనంగానే పార్టీ తీరును తప్పుపడుతూ వస్తున్నారు. దాదాపు పది మందితో కూడిన అసంతృప్తి వర్గం త్వరలో బిజెపి గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయం చూసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరంతా ఓ రహస్యమైన ప్రదేశంలో సమావేశం చర్చించుకున్నట్లు సమాచారం.


అయితే ప్రధాని మోదీ సభతో అంత దారికి వస్తుందనుకున్నప్పటికీ అటువంటిది ఏమీ లేనట్లుగా అసంతృప్త శిబిరంలోనే ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వారిలో కొంతమంది నేతలు పాలమూరు మోడీ సభకు దూరంగా ఉండిపోయారు. దీంతో వీరంతా పార్టీ మారడం పక్కా అని అందుకోసమే ప్రధాని మోదీ సభకు రాలేకపోయారనే వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. కానీ తాను పార్టీ మారడం లేదంటూ రాజగోపాల్ రెడ్డి క్లారీటీ ఇచ్చారు.