Telangana Latest News: జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత, క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా తప్పులు జరిగాయని, దీనికి బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లపై కేసులు పెడతారా, కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నివేదిక అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ
కమిషన్ అందజేసిన 665 పేజీల నివేదికను అందుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేయనున్న మొట్టమొదటి పని, దీనిపై శాసన సభలో చర్చ పెట్టడం. శాసనసభ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలను ప్రజల్లో చర్చ పెట్టడం ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా, ప్రభుత్వం ఏకపక్షంగానో, కక్షపూరితంగానో ఏ నిర్ణయం తీసుకోదని, సభలో చర్చ జరిగిన తర్వాత వ్యక్తమైన అభిప్రాయాల మేరకే విచారణకు ఆదేశిస్తామన్న సంకేతాలు ఈ చర్చ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది.
2. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయడం
అసెంబ్లీ చర్చ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని, దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని భావిస్తే, ప్రభుత్వం నేరుగా బాధ్యులైన కేసీఆర్, హరీశ్ రావు, ఈటల వంటి నేతలతో సహా ఇందుకు బాధ్యులైన ఇంజనీర్లపైన, కాంట్రాక్టర్లపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. అయితే, క్రిమినల్ కేసులు నేరుగా పెట్టే ముందు ప్రభుత్వం న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది.
3. ప్రజా ధనం రాబట్టే అవకాశం
కాళేశ్వరం కమిషన్ నివేదికలో ప్రజాధనం వృథా అయిందని పేర్కొనడం జరిగింది. ఎంత మేర వ్యయం వృధా అయిందన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. నష్టాన్ని అంచనా వేసి, ఇందుకు బాధ్యులైన వారి నుంచి రాబట్టే అవకాశం ఉంది. అలాంటి రికవరీ చట్టాలను ప్రభుత్వం బాధ్యులపై ప్రయోగించవచ్చు. అది బాధ్యులైన ప్రభుత్వ పెద్దల నుంచా లేక ఇంజనీర్లు లేదా కాంట్రాక్టర్ల నుంచా అన్నది కమిషన్ నివేదిక, సిట్ నివేదిక, చివరికి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి ఉంటుంది.
4. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్ణయం
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో మార్పులు చేయాల్సి ఉందా, ఏదైనా పునఃనిర్మాణం జరపాల్సి ఉందా, అలా చేయాల్సి వస్తే ఏం చేయాలి అన్న అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం నీటి పారుదల రంగ నిపుణుల సలహాలను తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు.
5. రాజకీయంగా ప్రజల్లోకి ఒక సంకేతం పంపడం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని, అవినీతికి పాల్పడిందని ప్రజల్లోకి బలమైన సంకేతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లనుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న చర్చ ప్రజల్లో జరిగేలా చూసే అవకాశం ఉంది. తమ పాలన అవినీతిరహిత పాలన అనే ముద్రను వేసుకునేలా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వ్యూహం ఉండవచ్చు.
అయితే, రాజకీయంగా, న్యాయపరంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ సర్కార్‌కి ప్రతిఘటన తప్పకపోవచ్చు. పై చర్యలన్నింటికీ ప్రతిగా బీఆర్ఎస్ చీఫ్ ప్రతి వ్యూహాలను పన్నే అవకాశం లేకపోలేదు.