Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఎనభై సీట్లు సాధిస్తామని అంత కంటే తగ్గిస్తే కేసీఆర్ వేసే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతులేని ఆత్మవిశ్వాసంతో సవాల్ చేస్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ కు అనేక రకాల కారణాలు ఉండవచ్చు కానీ.. గత మూడు దశాబ్దాల చరిత్ర కూడా.. కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు అంత ఉత్సాహంగా లేదు. అరవై సీట్లు సాధిస్తే అంటే.. కనీస మేజిక్ మార్క్ సాధిస్తే.. రికార్డు సృష్టించినట్లే. ఎందుకంటే గత ముఫ్పై ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఎప్పుడూ 60 సీట్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధించినప్పుడు కూడా 59 సీట్లే వచ్చాయి.
అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు
మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణలో మొదటి సారి అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడే వరకూ తెలంగాణ మొత్తం ప్రభావం చూపించేంత పార్టీ కాదు. పొత్తులు పెట్టుకున్నా 40 సీట్లకు పరిమితమయ్యేది. సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఆ పార్టీకి పట్టు ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క సారిగా పుంజుకుంది. తొలిసారి 63, తర్వాత 88 సీట్లు గెల్చుకుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఎప్పుడూ 60 సీట్లు సాధించలేకపోయింది. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ రికార్డును బద్దలు కొడతామని అంటోంది.
క్రమంగా బలహీనపడుతూ వస్తున్న కాంగ్రెస్
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. 2018 ఎన్నికలప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఉమ్మడి ఏపీలోనూ కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలే !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 60 సీట్లకు పైగా సాధించలేదు. 1989 ఎన్నికల్లో అత్యధికంగా 59 స్థానాల్లో గెలుపొందింది. నాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు 181 సీట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో తెలంగాణలో 42 నియోజకవర్గాల్లోనే గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు వచ్చింది కేవలం 26 సీట్లు మాత్రమే. 1999, 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా, తెలంగాణలో వచ్చినవి 48 మాత్రమే. 2009లో 156 స్థానాల్లో గెలుపొందగా, తెలంగాణలో 49 స్థానాల్లో గెలుపొందింది హస్తం పార్టీ.
ఇప్పుడు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే !
గత 30 ఏళ్ల ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. అది కూడా 30 ఏళ్ల కిందట. 60 సీట్లు ఏనాడూ దాటలేదు. ఈ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సాధించిన విజయం అంతంతమాత్రమే అనుకోవచ్చు. ఈ సారి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది. గత మూడు దశాబ్దాల కాలంలో చూడనంతటి విజయాన్ని అందుకోవాలి. అరవై కాదు.. తాను ఎనభై సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి ధైర్యంగా చెబుతున్నారు. ఎంత వరకూ సాధ్యమవుతుదో కానీ.. ఎనభై కాదు.. సాధారణ మెజార్టీకి అవసరం అయిన అరవై తెచ్చుకున్నా.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఊహించని విధంగా బలపరిచినట్లే అనుకోవచ్చు.