Telangana Elections 2023 : తెలంగాణ బీజేపీ తాము గెలిస్తే బీసీని సీఎం ను చేస్తామని ప్రకటించింది. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా అదే కారణం అని టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బీసీని సీఎంను చేయాలనుకుంటున్నామని అందుకే.. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని హైకమాండ్ ఆదేశించిందని చెబుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో బీసీ నేతను సీఎంను చేస్తామని భరోసా ఇస్తారు. ఆ బీసీ నేత ఎవరు అన్నది ప్రకటించినా .. ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతలు మత్రం బీసీ సీఎం నినాదంపై వీలైనంత వరకూ మౌనం పాటించే వ్యూహంలోనే ఉన్నాయి. ఎక్కువ స్పందిస్తే తమ పార్టీలో కూడా బీసీ ఉద్యమం వస్తుందని .. అదే జరిగితే బీజేపీకి మేలు చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారు.
బీఆర్ఎస్‌లో బీసీ సీఎం అనే నినానికి చాన్స్ లేదు !
భారత రాష్ట్ర సమితిప్రాంతీయ పార్టీ. పూర్తిగా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంటుంది. ఆ కుటుంబం చేతి నుంచి పార్టీ జారిపోయే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అయ్యేది వారే. ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారు. తర్వాత కేటీఆర్ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అంతే కానీ.. బీఆర్ఎస్‌లో మరో నేత ముఖ్యంగా బీసీ నేత సీఎం అయ్యే అవకాశాలే లేవు. అందుకే బీసీ సీఎం నినాదాన్ని బీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకోలేదు. కుణం కాదు గుణం ముఖ్యమని అమిత్ షా బీసీ సీఎం ప్రకటన చేసినప్పుడు కేటీఆర్ స్పందించారు. తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు. దీనిపై ప్రజల్లో చర్చ జరిగితే తమకే నష్టమని అనుకుంటున్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో శ్రీనివాస్ గౌడ్ వంటి బీసీ నేతలతో కౌంటర్లు ఇప్పించారు కానీ..తర్వాత ఆ మాత్రం స్పందన కూడా ఇవ్వడం లేదు.
కాంగ్రెస్ బీసీ నినాదం వినిపించడం కష్టం !
బీసీ సీఎం నినాదంపై కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రెండు అంటే రెండు శాతం ఓట్లు ఉన్న బీజేపీ బీసీని ఎలా సీఎంను చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అన్నారు. అంతే రాష్ట్ర నేతలు ఎవరూ బీసీ సీఎం గురించి మాట్లాడటం లేదు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా విరుచుకుపడినా సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో.. ఆ పార్టీ గెలిస్తే.. రెడ్డి సామాజికవర్గ నేతలే సీఎం పదవి కోసం పోటీ పడతారు. ఈటల, బండి సంజయ్ తరహాలో కాంగ్రెస్ లో బలమైన బీసీ నేత లేరు. అదే సమయంలో.. రెడ్డి వర్గం కాదనుకుంటే.. దళిత వర్గాల నుంచి భట్టి విక్రమార్క రేసులో ఉంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ పెద్దగా బీసీ సీఎం నినాదంపై కల్పించుకోవడం లేదు. ఈ అంశంపై బీజేపీ చేసే ప్రచానికి ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే అంత మైనస్ జరుగుతుందని భావిస్తన్నారు.
రెండు పార్టీల నిస్సహాయత బీజేపీకి ప్లస్ పాయింట్
బీసీ సీఎం నినాదం విషయంలో రెండు పార్టీలు కౌంటర్ ఇవ్వలేకపోవడంతో బీజేపీ దూకుడు పెంచుతోంది. ప్రధానితో ఆత్మగౌరవ సభను నిర్వహింప చేస్తున్నారు. రెడు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణళికలు సిద్ధం చేసుకున్నారు. బీసీ సీఎం నినాదంతో వెళ్తే.. తమకు తిరుగు ఉండదన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆత్మరక్షణ ధోరణి బీజేపీకి ఓ అవకాశం కల్పిస్తోందని అనుకోవచ్చు.