YS Sharmila fires on CM KCR and Minister KTR:


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నా, బీఆర్ఎస్ ను ఓడించేందుకు వైఎస్ షర్మిల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడంపై షర్మిల మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ కు అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నారా అని నిలదీశారు. రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే సంపదను పందికొక్కుల్లా తినేశారని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.


మిమ్మల్ని మించిన తెలంగాణ దోహులు ఉండరేమో!
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను మిమ్మల్ని మించిన తెలంగాణ దోహులు ఇంకెవ్వరు ఉండరని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని ఎంతగానో నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు మీరు అని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కేవలం కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు అని కేసీఆర్, కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


కాళేశ్వరంలో లక్ష కోట్ల దోపిడీ!
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, అన్నారంలోనూ డ్యామేజీ జరగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికిరాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేశారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు.  ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులన్నారు. 3 ఎకరాల భూమి,ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేశారు. 


నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కానీ నిధులు మీ ఖజానాకు, నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే చేరాయని.. నియామకాలు మీ ఇంట్లో వాళ్లకే అంటూ ఉద్యమ సిద్ధాంతంపై ప్రశ్నలు గుప్పించారు. రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తరువాత సైతం సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనం అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు ఎన్నికలకు సిద్ధమయ్యారు అని షర్మిల పోస్ట్ చేశారు.