Revanth Reddy Changing Tone :   తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శైలి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన దూకుడు, ప్రత్యర్థులపై విరుచుకుపడే నిరంతర ఎదురుదాడి. విపక్ష హోదాలో ఉన్నా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన వైఖరి ఎప్పుడూ ఆఫెన్సివ్‌గానే ఉండేది. అయితే, ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్ సమావేశాల్లోనూ, ఇతర బహిరంగ వేదికలపైనా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. కొడంగల్ సహా పలు సభల్లో తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు.   విపక్షాలు నన్ను పని చేసుకోనివ్వాలి.. నా గొంతు నొక్కాలని చూస్తున్నారు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నిరంతర ఫైరింగ్ టోన్‌కు భిన్నంగా, ఒక రకమైన ఆవేదనను లేదా ఆత్మరక్షణ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. 

Continues below advertisement

ఆరు గ్యారంటీల అమలుకు అడ్డం పడుతున్న ఆర్థిక పరిమితులు

ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. పరిపాలనలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సవాళ్లే మొదటిది. ఎన్నికల హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు  పూర్తిస్థాయిలో నెరవేర్చడంలో ఎదురవుతున్న ఆర్థిక పరిమితులు,  ఉపాధి హామీలు, పింఛన్ల పంపిణీపై విపక్షాల నుంచి వస్తున్న నిరంతర ఒత్తిడి ఒకవైపు కాగా   హైడ్రా  సృష్టించిన కలకలం, ప్రభుత్వాన్ని కొంత రక్షణత్మక వైఖరిలోకి నెట్టాయి. గడిచిన ఎనిమిది-తొమ్మిది నెలల పాలనలో ఊహించిన వేగంతో ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం, అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ కాకపోవడం వల్ల వచ్చిన అసంతృప్తి రేవంత్ రెడ్డి స్పీచ్‌లలో ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

కొడంగల్ ఓటర్ల సవరణలో బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేయగలవు?

మరోవైపు, కొడంగల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ,  ఫార్మా సిటీ నిరసనలపై ప్రతిపక్షాలైన బిఆర్ఎస్ , బిజెపి సంయుక్తంగా తన రాజకీయ పునాదినే దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయని సీఎం బహిరంగంగా ఆరోపించడం ఆయనలోని రాజకీయ భయాన్ని   స్పష్టం చేస్తోందని విపక్ష నేతలంటున్నారు.  తన సొంత నియోజకవర్గంలోనే ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, తన పట్టును బలహీనపరిచేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయని పదేపదే అనడం పార్టీ నేతలకు కూడా ఇబ్బందికరంగా ఉంది.  కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణలు కూడా రేవంత్ శైలిని ప్రభావితం చేస్తున్నాయి. ఒకవైపు ఢిల్లీ అధిష్టానం నిర్ణయాలపై ఆధారపడటం, మరోవైపు మంత్రివర్గంలోని సీనియర్ నేతల వైఖరి, అసంతృప్తుల సమన్వయం వంటి అంశాలు ఆయన స్వేచ్ఛాయుత నిర్ణయాధికారానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. గతంలో  ఫైర్ బ్రాండ్ నాయకుడిగా విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు  ముఖ్యమంత్రి అనే రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండటం వల్ల వ్యాఖ్యల్లో కొంత సంయమనం వహించాల్సి రావడం సహజమే అయినా.. నన్ను పని చేసుకోనివ్వడం లేదు  అనే రక్షణాత్మక ధోరణి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది.

ఆ దూకుడు అధికారంలో ఉంటే కష్టమే!

 రేవంత్ రెడ్డి మాటల్లో కనిపిస్తున్న ఈ హెచ్చుతగ్గులు కేవలం పాలనాపరమైన ఒత్తిడి వల్ల వచ్చినవి కావు.  గ్రేటర్ ఎన్నికలు, కొడంగల్‌లో పట్టు నిలుపుకోవడం,  విపక్షాల ఐక్య దాడిని తిప్పికొట్టే క్రమంలో ఆయన అమల్లోకి తెచ్చిన సెంటిమెంట్ కార్డ్ కూడా కావచ్చు. అయితే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు ఆవేదన వ్యక్తపరిస్తే అది బలహీనతగా ప్రచారమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి తిరిగి తన మార్క్ ఆఫెన్సివ్ డెవలప్‌మెంట్ ఎజెండాతో ముందుకు వస్తారా లేక ఈ పొలిటికల్ అప్రమత్తతలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.