" దేశం నుంచి నిన్ను తరిమేస్తాం.. మాకివ్వాల్సినవి ఇవ్వకుండా ఇచ్చేవాడిని తెచ్చుకుంటాం.. ఖబడ్దార్ మోదీ" అని తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) గర్జించారు. జనగామలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. " సిద్దిపేట ప్రజలు పంపిస్తే తెలంగాణ సాధించామని.. మీరందరూ పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతామని" తెలంగాణ ( Telangana ( ప్రజలకు పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీ దాకా వస్తామని.. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.   


కేసీఆర్ తన ప్రసంగంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కేంద్రంపై పోరాటానికి పోవాలా వద్దా అని ప్రజల్ని అడిగారు.   " పోవాల్సిందేనా పోరాటానికి..పోవాల్నా... పోదామా.." అని సభికుల నుంచి అనుమతి తీసుకుని ఆ తర్వాత "  జాగ్రత్త నరేంద్రమోదీ... ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ.. మీ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు..." అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం వస్తే కొట్లాడటానికైనా సిద్ధమన్నారు.  మీ జాగ్రత్తలతో మీరుండాలని..మా జాగ్రత్తలతో మేముంటామని మాతో పెట్టుకోవద్దని కేసీఆర్ బీజేపీ నేతలను హెచ్చరించారు. జనగామ టౌన్‌లో పిడికెడు లేని బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కొట్టారని  బీజేపీ బిడ్డల్లారా మంచివాళ్లం కాబట్టి ఏమీ అనం కానీ మమ్మల్ని ముట్టుకుంటే నాశనం చేస్తామని హెచ్చరించారు. మా శక్తి ముందర మా బలం ముందర మేం ఊదితే మీరు అడ్రెస్‌ కూడా లేకుండా పోతారు జాగ్రత్త టీఆర్‌ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని హెచ్చరించారు.  మా బలం ముందు ఊదితే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. 


 ప్రధానమంత్రి నరేంద్రమోడీ  ( PM Narendra Modi ) పేదలు, రైతులపై పడ్డారని కేసీఆర్ విరుచుకుపడ్డారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెట్టాలని నరేంద్రమోడీ అంటున్నారని తనను చంపినా పెట్టనని చెప్పానన్నారు. గతంలో చంద్రబాబు కూడా మీటర్లు పెట్టాలని అన్నారని.. ఆయన కూడా పోయారన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంతో కొట్లాట పెట్టుకోలేదన్నారు. తాము బీజేపీతో జనాల కోసం కొట్లాట పెట్టుకుంటామన్నారు. అసలు ఏమీ తెలంగాణకు ఇవ్వలేదన్నారు.   రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతంగా ముందుకు పోతోందన్నారు. జనగామలో మెడికల్ కాలేజీ వస్తుందని అనుకున్నామా అనిప్రజల్ని ప్రశ్నించారు.


తెలంగాణ ప్రజలకు దళిత బంధును అమల్లోకి తెచ్చామని అన్నారు. దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తున్నామన్నారు. దళితులకు వైన్ షాపుల్లో కూడా రిజర్వేష్లు ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా దళితులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం ఏంచేసిందో మీ కళ్ల ముందే ఉందని కేసీఆర్ తెలిపారు.