Somu Vs Etela :   ఆంధ్రప్రదేశ్‌లో జగన్ లక్షలాది ఇళ్లు కట్టిస్తున్నారని కానీ తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని బీజేపీ నేతల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈటల మాటల్ని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. దీనికి కారణం కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చార్జిషీట్‌ ఉద్యమంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో పొరపాటు, అలసత్వం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరామన్నారు.  దానికి భిన్నంగా ఈటల స్పందించారు. 


30 వేల ఇళ్లు మాత్రమే కట్టారంటున్న సోము వీర్రాజు 


వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.  కేంద్రం కేటాయించిన ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సోము వీర్రాజు అంటున్నారు.  ఇళ్లు నిర్మాణ స్థితికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి తన రాయితీని మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం మరో 20 లక్షలు ఇళ్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజక కింద మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ 20 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయన్నారు.  ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.  పేదలకు లబ్దిచేకూరాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.  


లక్షల ఇళ్లు కడుతున్నారని ఈటల ఎలా చెప్పారు ? 


అయితే తెలంగాణ బీజేపీ కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పొరుగు రాష్ట్రంలో లక్షల ఇళ్లు కడుతున్నారని చెప్పారు. ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటన్నది ఏపీ బీజేపీ నేతలకు తెలియదు. అయితే తెలంగాణ సర్కార్ తో పోలిక చూపించడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం  చిన్న చిన్న ఇళ్లు ఆత్మగౌరవానికి భంగం అని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం సెంటు స్థలంలో ఇళ్లు నిర్మిస్తోంది. నలభై గజాల స్థలంలో నిర్మిస్తున్న ఇళ్లపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  ప్రసన్నకుమార్ రెడ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి చిన్న ఇళ్లు నివాసానికి పనికి రావని అంటున్నారు. తెలంగాణ సర్కార్ మాత్రం హైరైజ్ అపార్టుమెంట్ల తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఇలాంటి ఇళ్లనే గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మించింది. కానీ ఇప్పటి వరకూ లబ్దిదారులకు హ్యాండోవర్ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. 
 
ఏపీ బీజేపీ ఈటలతో సవరణ చెప్పిస్తుందా ?


ఓ వైపు వైసీపీ ప్రభుత్వంపై తాము అవిశ్రాంతంsగా పోరాడుతున్నామని బీజేపీ నేతలు చెబుున్నారు. ప్రజా చార్జిషీట్ల పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్య ఏదైనా.. ఎప్పటికప్పుడు బీజేపీ, వైసీపీ ఒకటే అనే పరిస్థితి ఏర్పడుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఏపీలో పరిస్థితులు తెలియక.. అక్కడి ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదని తెలియక .. కట్టిందని చెప్పానని వివరణ ఇప్పించే ప్రయత్నం చేస్తారా లేకపోతే..  సైలెంట్ గా ఉంటారా అన్నది ఆ ఆ  పార్టీ నేతలు నిర్ణయించుకోవాల్సి ఉంది. అయితే ఈటల మాటలు మాత్రం వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఏపీ బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతున్నాయి.