కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నేతలకు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇందుకు దీటుగా స్పందిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోడీ వ్యాఖ్యలతో కేసీఆర్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయన్నారు బీజేపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కేసీఆర్ కోరికను ప్రధాని బయటపెట్టడంతో... ఆయన కుటుంబంలో లొల్లి మొదలైపోయిందన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చీలిక రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
కరీనగరంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ భ్రష్ణు పట్టడానికి కేటీఆర్ అహంకార వైఖరి, మాటతీరే కారణమని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ప్రధాని మోడీపై చిల్లర మాటాలు మాట్లాడారన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ తెలంగాణపై విషం చిమ్మారని లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మోడీ తెలంగాణపై విషం చిమ్మితే... బీఆర్‌ఎస్ ఎంపీలు సభ ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారాయన. ప్రధాని మోడీ విషం చిమ్మితే అడ్డుకోవాల్సిన బీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు బల్లలు చరిచారని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రధాని మోడీ విషం చిమ్మారని కేటీఆర్ ఒక్కరికే వినపడిందా అంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు మొత్తం విషం నింపుకుని...పక్కవాళ్లపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో ప్రకంపనలు మొదలయ్యాని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని చెప్పారు. కేసీఆర్ నిజస్వరూపాన్ని ప్రధాని మోడీ బయటపెట్టారని.. కేటీఆర్‌ను సీఎం చేయాలన్న ఆలోచన ఉందన్న విషయం చెప్పడంతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరు..? అన్న విషయంపై కేసీఆర్ కుటుంబసభ్యులు కొట్లాడుకుంటున్నారన్నారు బండి సంజయ్. కేటీఆర్ విషయం గురించి ప్రధాని మోడీ చెప్పగానే... కేసీఆర్ అల్లుడు ఇంట్లో టీవీ పగలగొట్టాడని... రేపటి నుంచి కేసీఆర్ కూతురు కూడా లొల్లి పెడుతుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడైనా చీలిపోవచ్చని చెప్పారు. బీఆర్‌ఎస్ చీలిపోవాలని తాము కోరుకోమని... కలిసి ఉండాలనే కోరుకుంటామని.. కానీ ప్రధాని మోడీ అసలు విషయం బయటపెట్టిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చంటూ పదేపదే చెప్పారు బండి సంజయ్.
కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కేసీఆర్ ఆలోచన తెలిసిన తర్వాత.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పార్టీని వీడి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం కూడా ముక్కలయ్యే అవకాశం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు రాత్రి నుంచే కుంపట్లు పెడుతున్నారని చెప్పారు. కేటీఆర్‌ను ఇప్పుడే భరించలేకపోతున్నా... సీఎం అయితే భరించగలమా అన్న అభిప్రాయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ భ్రష్టు పట్టడానికి కారణంగా కేటీఆర్, ఆయన వాడే బాషే అన్నారు బండి సంజయ్. కేటీఆర్ ముఖంలోనే అహంకారం కనిపిస్తుందన్నారు. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటని.. బీఆర్‌ఎస్ నేతలు చర్చించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.