Etala Vs KCR :  ఈటల రాజేందర్‌పై మరోసారి సస్పెన్షన్ వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలంగాణ రాజకీయవర్గాలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేశాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడంపై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. స్పీకర్ మరమనిషిలాగా.. వ్యవహరిస్తున్నారని కేసీఆర్ చెప్పినట్లుగా చేస్తున్నారని విమర్శించారు. వెంటనే సబా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈటల స్పీకర్‌ను దారుణంగా అవమానంచారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రకటన చేసిన గంటల్లోనే స్పీకర్ కార్యాలయం నుంచి ఈటలకు నోటీసులు వెళ్లాయన్న ప్రచారం ప్రారంభమయింది. వచ్చే సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుంది. రెండు రోజులు మాత్రమే సాగుతాయి. ఈ రెండు రోజులు కూడా ఈటలపై సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమని భావిస్తున్నారు. 


బీజేపీ నుంచి గెలిచినా అసెంబ్లీలో కూర్చోలేకపోయిన ఈటల రాజేందర్ !


ఒకప్పుడు కేసీఆర్‌కు అనుంగు అనుచరుడు అయిన ఈటల రాజేందర్‌కు ఆయనతో చెడిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి అవమానకరంగా పార్టీ నుంచి బయటకు రావాల్సివచ్చింది. బీజేపీలో చేరి హాజురాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు . అయితే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడకూడదని కేసీఆర్ పట్టుదలకు పోయారన్న ప్రచారం జరిగింది. కానీ ఈటల గెలిచారు. దీంతో అసెంబ్లీలో ఈటల -కేసీఆర్ ఎదురు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ అసెంబ్లీలో కూర్చుని చర్చల్లో పాల్గొనే అవకాశం కనిపించలేదు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరసన వ్యక్తం చేశారన్న కారణంగా బీజేపీ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. దీంతో  వారు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. అసెంబ్లీలో తనను చూడకూడదనే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని అప్పట్లో ఈటల విమర్శించారు. 


ఇప్పుడు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల పేరుతో వేటు వేసే అవకాశం !
  
స్పీకర్ ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీ ని అవమానపరిచినట్టేvvf  మంత్రి వేముల చెబుతున్నారు.  ఈటల స్పీకర్ కు క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడేందుకు సభా నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని హెచ్చరించారు. ఈటల   అభ్యంతరకరమైన మాటలేమీ మాట్లాడలేదని చెబుతున్నారు. అది నిషేధిత పదం కాదంటున్నారు. కాబట్టి క్షమాపణ చెప్పేది లేదంటున్నారు. తన ముఖం అసెంబ్లీలో చూడటం ఇష్టం లేదని కేసీఆర్ ప్రకటించి సస్పెన్షన్ వేటు వేయాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు.  అసెంబ్లీ జరుపుతోంది రెండు రోజులే కాబట్టి.. ఈ రెండు రోజులూ ఈటలపై వేటు వేసే అవకాశం ఉంది. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరు పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నారు. మరొకర్ని సస్పెండ్ చేస్తే ఇక రఘునందన్ రావు ఒక్కరే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటారు. 


ఈటలను ఎంత కాలం అసెంబ్లీ నుంచి దూరంగా ఉంచగలరు !?


అయితే కేసీఆర్ పట్టుదల ప్రకారం చూస్తే ఈ సమావేశాల్లో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయవచ్చు కానీ ప్రతీ సారి అలా చేయలేరన్న వాదన వినిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయి. అప్పుడు కూడా ఏదో ఓ కారణం చెప్పి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేసీఆర్ పంతానికి అర్థం ఉండదు. కానీ అలా వరుసగా సస్పెన్షన్ వేటు వేస్తూ పోతే.. సభ్యుడి హక్కులను కాలరాసినట్లవుతుంది. కారణం లేకుండా లేకపోతే చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే ఈ అంశంపై టీఆర్ఎస్‌లోనూ రకరకాలుగా చర్చ జరుగుతోంది.