గద్వాల నియోజకవర్గంలో దశాబ్దాలు ఒకే కుటుంబం మధ్య వార్ జరుగుతోంది. అఖరికి అన్నదమ్ములు కూడా శత్రువులుగా మారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఆ కుటుంబమే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గద్వాల్‌ కోట గురించి అందరికి తెలిసిన విషయయే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్‌ విషయం కూడా ఉంది. డీకే అరుణ కుటుంబానికి ఇది కంచుకోట. 70ఏళ్లుగా గద్వాల రాజకీయాలను డీకే కుటుంబమే శాసిస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్టూ ఉంది. డీకే అరుణ కుటుంబమే రెండు వర్గాలుగా విడిపోయి ప్రత్యర్థులుగా తలపడ్డారు. తండ్రి డీకే సత్యారెడ్డి వారసత్వాన్ని సమరసింహారెడ్డి కొనసాగించారు.  1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా డీకే భరతసింహారెడ్డి, కాంగ్రెస్‌ తరపున డీకే సమరసింహారెడ్డి పోటీ చేశారు. అప్పటికే సమరసింహారెడ్డి నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే అన్నయ్యక సమరసింహరెడ్డిపై తమ్ముడు, డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి పైచేయి సాధించారు. ఆ ఎన్నికల్లో అన్న సమరసింహారెడ్డిపై 32వేల 561 ఓట్ల తేడాతో డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి గెలుపొందారు. 


1957 నుంచి డీకే ఫ్యామిలీదే  హవా 
1980లో గద్వాలలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు డీకే సమరసింహారెడ్డి. కాంగ్రెస్‌ తరపున 1980లో పీపీఆర్‌ రెడ్డిపై 26, 894 ఓట్ల తేడాతో, 1983లో పుల్లారెడ్డిపై 4593 ఓట్ల తేడాతో, 1989లో టీడీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై 10,454 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ పని చేశారు. తిరుగులేని విజయాలు సాధించిన సమరసింహారెడ్డి జైత్రయాత్రకు తమ్ముడు భరతసింహారెడ్డి చెక్‌ పెట్టారు. 1994లో టీడీపీ మద్దతు తీసుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సమరసింహారెడ్డిపై 32, 561 ఓట్ల తేడాతో గెలుపొందారు. తమ్ముడు భరతసింహారెడ్డి కొట్టిన దెబ్బ నుంచి సమరసింహారెడ్డి మళ్లీ కోలుకోలేకపోయారు. మళ్లీ ఆయన పోటీ చేసినప్పటికీ  గద్వాల్ లో గెలుపు మాత్రం సాధించలేకపోయారు. 


అత్తాఅల్లుళ్ల సవాల్
గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ మంత్రి డీకే అరుణ, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తలపడనున్నారు. గద్వాల నియోజకవర్గంలో 2004,2009,2014 ఎన్నికల్లో డీకే అరుణ విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అరుణ...రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ల మంత్రివర్గాలలో పని చేశారు. 2009,2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మూడోసారి మాత్రం అత్త డీకే అరుణను ఓడించారు. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి...తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28,260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న డీకే అరుణకు మేనల్లుడు కృష్ణవెూహన్‌ రెడ్డి ఓటమి రుచి చూపించారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. 


డీకే సత్యారెడ్డి వారసత్వం
1972లో ఎమ్మెల్యేగా పని చేసిన పి పుల్లారెడ్డి...కాంగ్రెస్‌, టీడీపీ తరపున పోటీ చేశారు. 1972లో డీకే సత్యారెడ్డిని ఓడించిన పుల్లారెడ్డి...కొడుకు డీకే సమరసింహారెడ్డిని మాత్రం ఓడించలేకపోయారు. 1983లో పుల్లారెడ్డిపై డీకే సమరసింహారెడ్డి విజయం సాధించారు. పుల్లారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసినపుడు గెలిస్తే...టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గద్వాల రాజకీయాలను పరిశీలిస్తే డీకే కుటుంబం విడిపోయి పోటీ చేసినప్పటికీ...పట్టును మాత్రం కోల్పోలేదు. 1994లో అన్నదమ్ములైన సమరసింహారెడ్డి, భరతసింహారెడ్డి తలపడితే...2009 నుంచి వరుసగా మూడుసార్లు అత్తాఅల్లుళ్లు తలపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి ముఖాముఖి ఫైట్‌కు రెడీ అయ్యారు. డీకే అరుణ ఈ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుంటే...బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్‌ తరపున పోటీ పడుతున్నారు.