Duvvada Srinivas Responds On Duvvada Vani Nomination: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నామినేషన్లు, ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ నెలకొంటోంది. అయితే, శ్రీకాకుళం జిల్లా రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) బరిలో నిలవగా.. ఆయన భార్య దువ్వాడ వాణి (Duvvada Vani) సంచలన ప్రకటన చేశారు. జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న ఆమె తాను టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్లు ఆమె అనుచరుల దగ్గర ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, దువ్వాడ వాణి ప్రకటనపై ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.


'ప్రజలే న్యాయ నిర్ణేతలు'


'వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం, హక్కు ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం. కలియుగ ప్రభావం. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే, ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను.' అని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాను రాత్రికి రాత్రే రెడీమేడ్ గా తయారైన నాయకుడిని కాదని.. తనది పాతికేళ్ల రాజకీయ జీవితం అని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గాన్ని వైసీపీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని.. టీడీపీ నాయకులు ఇక్కడ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ ఇంటింటికీ సంక్షేమం అందించడం సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఈసారి టెక్కలి 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.


దువ్వాడ వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ ఇంఛార్జీలను మార్పు చేసింది. ఈ క్రమంలో దువ్వాడ వాణిని మార్చి దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు సీఎం జగన్. దీంతో తనను ఇంఛార్జీగా నియమించినా టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో దువ్వాడ వాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపునకు సహకరించాలని, ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా ఆమె అంగీకరించలేదు. మరోవైపు, దువ్వాడ వాణి టెక్కలి బరిలో ఉంటే దువ్వాడ గెలుపు కష్టంగా మారుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. 


దువ్వాడ వాణి రాజకీయ నేపథ్యం


దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా పని చేశారు. 2004లో కాంగ్రెస్‌ తరఫున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.  


Also Read: Chandrababu Affidavit: కాసు బంగారం కూడా లేని చంద్రబాబు - లోకేష్‌, భువనేశ్వరి వద్ద అప్పులు- టీడీపీ అధినేత ఆస్తులు, కేసుల చిట్టా ఇదే