AP Legislative Council : ఆంధ్రప్రదేశ్   శాసనమండలి స్వరూపం మారనుంది. శాసనమండలిలో అధికార పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది.  బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. అలాగే శాసనసభలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం కూడా లభించలేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58గా ఉంది. వీరిలో అధికార వైఎస్ఆర్‌సీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 33 నుంచి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి 45కు చేరుకోనుంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య  సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.                  


మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీజేపీ 


బీజేపీ ఉన్న ఒక్క సభ్యుడూ తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. శాసనమండలిలో ఇప్పటి వరకూ ఆ పార్టీ నేత పీవీఎన్‌ మాధవ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఆపార్టీకి లేకుండా పోయింది. దీంతో చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ , 4 స్థానాలు టీడీపీ  దక్కించుకున్నాయి. టీడీపీకి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు అంటే 29న కొందరు, మే నెలాఖరుతో మరికొందరి సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు.                   


భారీగా తగ్గనునన టీడీపీ బలం 


ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మహిళా నేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో కొత్తగా వీరు శాసనమండలి లో అడుగు పెట్టనున్నారు. అలాగే అధికార వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు. దీంతో పెద్దల సభ లో వైకాపా పూర్తి మెజార్టీ ని సాధించనుంది.అలాగే ప్రస్తుతం ఎన్నికైన నలుగురు సభ్యులతో టీడీపీ 8 మందితో ప్రతిపక్ష హోదా ను నిలబెట్టుకోనుంది.  గ్రాడ్యూయేట్స్ తో పాటు ఎమ్మెల్యే కోటాలో అనూహ్య విజయం సాధించడంతో ఇది సాధ్యమయింది.     


వైసీపీకి పూర్తి మెజార్టీ !  


మండలిలో ప్రస్తుత వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి… ప్రస్తుతం అధికార వైకాపా 45, టీడీపీ -10, పీడీఎఫ్‌- 2, ఇండిపెండెంట్‌ -1 స్థానంలో వున్నారు. అయితే ఈ ఏడాది మే లో ఇద్దరు టీడీపీ సభ్యులు రిటైర్‌ కానున్నారు. అలాగే ఈ జులైలో గవర్నర్‌ కోటాలో భర్తీ కానున్న మరో 2 ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి అధికార పార్టీ బలం 47కు చేరనుంది. టీడీపీ కేవలం 8 మంది సభ్యులకు పరిమితం కానుంది. మళ్లీ రెండేళ్ల తర్వాతే మండలికి వివిధ కేటగిరీల కింద ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి చాలా పరిమితంగా సభ్యులు ఉండేవారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ వచ్చింది.