తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికల వేడి పెరగడంతో చంద్రబాబు ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రోడ్‌షోలు, బహిరంగసభలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సారి చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుంది. పార్టీ మహానాడు కంటే ముందు నుంచే వీరి పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించి మహానాడు కార్యక్రమాన్ని ఈ సారి మరింత ఘనంగా నిర్వహించనున్నారు. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం రోజుల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28. అందుకే ఈ సారి మే 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఒంగోలులో మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎక్కువగా గండిపేటలో మహానాడును నిర్వహించేవారు. ఈ సారి ఎన్నికలకు సమాయత్తమయ్యే మహానాడు కావడంతో ఏపీలో నిర్వహించనున్నారు. అయితే మహానాడును ఎన్ని రోజులు నిర్వహించాలన్నది పొలిట్ బ్యూరో భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు
2019లో మహానాడు జరపాల్సి ఉన్నా ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో సాదాసీదాగా నిర్వహించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టలేకపోయారు.ఇప్పుడు కరోనా తగ్గిపోవడం.. ఎన్నికల వేడి కూడా పెరగడం... ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అంచనా వేయడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.. ఇప్పటికే ప్రజలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. వారికి తామున్నామని భరోసా కల్పిస్తూ ప్రజల బతుకులు బాగుపడతాయని నమ్మకం కల్పించాలని భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఎవరున్నా రాష్ట్రాన్ని చుట్టేసి రావడం సహజం. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనే పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా పాదయాత్ర చేశారు. వారానికో సారి కోర్టుకు వెళ్లి వచ్చినా వారానికి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేశారు. కానీ ఈ సారిఏపీలో ఎవరూ పాదయాత్రలు చేయడం లేదు. పాదాయత్రల సీజన్ ముగిసిపోయిందని.. కాలం మారినందున ఇక టెక్నాలజీని వాడుకుని విస్తృత పర్యటనలు చేయడం మేలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముగ్గురు అగ్రనేతల పర్యటనలు సమాంతరంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంది.