Tdp Leaders Meet Chandrababu: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (Tdp) నుంచి టిక్కెట్ల కోసం ఆశావహులు, అసంతృప్తులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) కలుస్తున్నారు. తొలి జాబితాలో పేరు లేని వారు రెండో జాబితాలోనైనా తమకు టిక్కెట్ కేటాయించాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా టీడీపీ - జనసేన తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, కీలక స్థానాల్లో టికెట్ ఆశించి.. భంగపడ్డ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. కొందరిని వేరే చోటు నుంచి.. మరికొందరిని ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. తాజాగా, వైసీపీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు.


ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బుధవారం మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, కళా వెంకట్రావు వెళ్లి కలిశారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. సర్వేపల్లి టికెట్ పై సోమిరెడ్డి ఆయనతో చర్చించారు. పలాస టికెట్ ను గౌతు శిరీష ఆశిస్తుండగా.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. అలాగే, ఎచ్చెర్ల టికెట్ కళా వెంకట్రావు ఆశిస్తున్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. త్వరలోనే రెండో జాబితా విడుదల కానున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అని టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


'చంద్రబాబును సీఎంగా చూడాలి'


టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నెరవేరుస్తానని గుమ్మనూరు జయరాం అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను టీడీపీలో చేరానని చెప్పారు. పదవి వదులుకున్నా బర్తరఫ్ చేసినా తనకు అనసవరమని పేర్కొన్నారు. 'చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తా. ఆలూరుకు నా సేవలందించాను. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఆ స్థానంపై కొందరు ఆశలు పెట్టుకోవచ్చు. అయితే, అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. రాష్ట్రానికి మంచి జరగాలని.. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.' అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన ఆధ్వర్యంలో ఆలూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు.


మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు బీజేపీ కూటమిలో చేరిక, ఈ నెల ఏడో తేదీన ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో చోటు చేసుకోబోయే పరిణామాలు తదితర వాటిపై చర్చించారు. మిగిలిన 19 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన, అక్కడ ఎదురవ్వబోయే ఇబ్బందులు వంటివి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన అడిగిన స్థానాలు, వాటిలో తెలుగుదేశానికి ఉన్న ఇబ్బందులపైనా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. జనసేనకు ఇవ్వాల్సిన 19 స్థానాల్లో సుమారు ఆరేడు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నట్టు చెబుతున్నారు. ఆయా స్థానాల్లోనే జనసేనకు బలమైన నేతలు ఉండడంతో ఇరు పార్టీల అగ్రనేతలు వీటిపై సమాలోచనలు చేస్తున్నారు.  


Also Read: Mudragada Padmanabham : ఫైనల్‌గా వైసీపీలోకే ముద్రగడ పద్మనాభం - 12వ తేదీన కుటుంబమంతా చేరే అవకాశం !