Mudragada Padmanabham Join In YSRCP : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. ముద్రగడ ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గనేణ్ వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడతో ఫోన్ లో మాట్లాడారు.. వైసీపీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం లేదా పిఠాపురం సీట్లలో ఒక చోట ముద్రగడకు లేదా ఆయన కుటుంబసభ్యులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మనాభం ఓకే చేసినట్లుగా చెబుతున్నారు.
ముద్రగడ పద్మనాభం జనవరి ఒకటో తేదీన భారీ విందు సమావేశం పెట్టారు. ఈ సమవేశంలో వైసీపీలో చేరుతారని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదన్నారు. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ ముద్రగడ నివాసంకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పవన్ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నా రాకపోవడతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు.
ఈ లేఖ తరువాత పవన్ టీడీపీ – జనసేన నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పార్టీ మద్దతు దారులు నాకు సలహాలు ఇవ్వద్దు.. నాపై నమ్మకం ఉంటే నాతో కలిసిరండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరమైనట్లు.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ క్రమంలో పిఠాపురంర ఇంచార్జ్.. వంగా గీతను.. పిలిపించి మాట్లాడారు సీఎం జగన్. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే మార్పు ఉండవచ్చని చెప్పారు.
ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తునిలో ఆయన నిర్వహించిన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. రైలు ను కూడా తగులబెట్టారు. అయితేతర్వాత రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదిలేశారు. వైసీపీతో దగ్గరగావ్యవహరిస్తున్నారు.. మళ్లీ జనసేనకు దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్లీ వైసీపీకి వెళ్తున్నారు.