East Godavari Politics :   రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా టీడీపీ ఆశావహుల్లో ఒకటే టెన్షన్‌ పట్టుకుంది. ఇన్నాళ్లు ప్రజల్లో తామే అభ్యర్ధులమన్న నమ్మకంతో కష్టపడ్డ టీడీపీ నాయకుల ఆశలు గల్లంతవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో గెలుపు దగ్గర్లోనే ఉన్నా పోటీచేసే అవకాశం లేకపోతోందంటూ తలలు పట్టుకుంటున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన ఎగరేసుకుపోతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో ఆ నియోజవర్గాల్లోని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జులు ఒకటే హైరానా పడుతున్నారు. 


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మూడు సీట్లు !


జనసేన పార్టీకు మంచి పట్టున్న ప్రాంతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాగా ఈ జిల్లా పరిధిలోనే మూడు స్థానాలు జనసేన పోటీచేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం. అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైసీపీ గూటికి చేరుకోవడంతో ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి తీరుతామని మలికిపురం వారాహి సభ సందర్భంగా స్వయంగా జనసేనాన్ని ప్రకటించారు.  అయితే ఇక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు ఉండడం ఈసారి టీడీపీనే దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. 


జనసేన నేతల గట్టి  ప్రయత్నాలు


అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. జిల్లా హెడ్‌ క్వార్టర్‌ను టీడీపీ వదులకుంటుందా అంటూ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండడంతో జనసేనకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో జనసేనకు టిక్కెట్టు ఇవ్వాలని ఆ పార్టీ ఇంచార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పి.గన్నవరం నుంచి జనసేనకు టిక్కెట్టు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా ఒకే జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలనుంచి జనసేనకు కేటాయించడం జరగదని చర్చ జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యంకు సీటు ఇస్తారని అనుకుంటున్నా ఇక్కడ జనసేన పార్టీనే బరిలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 


పిఠాపురంపైనే జనసేన ఆశలు..


కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజకవర్గం గెలుపు పైనే జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం జనసేనకు కన్ఫర్మ్‌ అని తెలుస్తోంది. ఇక తుని, కాకినాడ రూరల్‌, జగ్గంపేట నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం సీటు జనసేనకే ఖరారు కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గ జనసేన అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి కూడా జనసేన బరిలో దిగనుందని ప్రచారం జరుగుతుంది. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా పేరున్న టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సారి పోటీ చేయరని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది.