Khammam TDP : తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలప్రదర్శనకు సిద్ధమయింది. పార్టీ లీడర్లు అంతా వెళ్లిపోయినా ఎంతో కొంత బలం ఉందని భావిస్తున్న ఖమ్మంలో బుధవారం చంద్రబాబు బహిరంగసభలో ప్రసంగించబోతున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. ఆ రెండు కూడా ఖమ్మం నుంచే ఉన్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో విజయం సాధించారు. ఈ సారి కూడా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. టీ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించిన తర్వాత ఆ పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. దీంతో అందరి చూపు ఖమ్మం సభపై పడింది.
హైదరాబాద్ నుంచి ర్యాలీగా ఖమ్మంకు పయనం !
టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి రసూల్‌పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. ఉప్పల్ చౌరస్తా, హయత్‌నగర్ , టేకుమెట్ల , గూడెం మీదుగా మధ్యాహ్నానికి కూసుమంచి చేరుకుంటారు.2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం చేరుకుని మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రాత్రి 7.30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరి వెంకటయ్యపాలెం మీదుగా చింతకానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8.30 గంటలకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్తారు.
లక్ష మందితో సభ నిర్వహించాలని టీడీపీ శ్రేణుల ప్రయత్నాలు !
రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీడీపీ ఇప్పుడు తెలంగాణపై పోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. గతంలో ఉన్న నాయకత్వం వేరే పార్టీలకు వలస పోవడంతో నూతనంగా కమిటీ ఏర్పాటుతోపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో తమకు సానుకూలంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో తమ పార్టీ ప్రాతినిద్యం వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించారు. ఆది నుంచి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి గట్టి పట్టుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తన సత్తాను చాటింది. సత్తుపల్లిలో విజయం సాదించింది. దీంతో పాటు 2018 ఎన్నికల్లో రెండు స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విజయం సాదించడం గమనార్హం. సత్తుపల్లిలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య మూడు సార్లు హ్యాట్రిక్‌గా విజయం సాదించారు. 2018లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి విజయం సాదించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో టీడీపీ నుంచి విజయం సాదించిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన చంద్రబాబు !
ఇటీవల కాలంలో ఆంధ్రాతోపాటు తెలంగాణపైనా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వరుసగా తమకు సానుకూలంగా ఉన్న జిల్లాలో పర్యటించి బలోపేతం చేయాలని భావనలో ఉన్నారు. టీడీపీ నుంచి బలమైన నాయకులుగా ఉన్న వారు వేరే పార్టీలకు వలస వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆంధ్రా సరిహద్దుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండటంతోపాటు ఇక్కడ ఎక్కువగా ఏపీతో సంబందాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఖమ్మంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా ఖమ్మం
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి ఖమ్మంలో మంచి ఫలితాలు సాధించలేదు. ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెల్చుకుంది. ఓ సారి కొత్తగూడెం.. మరోసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే గెల్చుకున్నారు. మిగతా తొమ్మిది చోట్ల పరాజయం పాలయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరి ఉండవచ్చు కానీ.. నేరుగా విజయం సాధించలేదు. ఈ సారి బీఆర్ఎస్ ద్వారా ఆ లోటు తీర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అతి చేరికలతో ఆ పార్టీ ఓవర్ లోడ్ అయిపోయింది. మొత్తం నాలుగు వర్గాలు ఖమ్మంలో ఉన్నాయి. దీంతో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీనికి తోడు కమ్యూనిస్టులతో పొత్తు కూడా ఉంటుంది. వారికి రెండు, మూడు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ కు ఎన్నికల సమీకరణాలే క్లిష్టంగా మారనున్నాయి.
లీడర్లు లేని కాంగ్రెస్ - లీడర్, క్యాడర్ లేని బీజేపీ !
మరో వైపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేరు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జిల్లా మొత్తానికి తిరుగులేని నేత కాదు. నియోజకవర్గాల్లో బలమైన నేతల కొరత ఉంది. ఇక బీజేపీకి.. అటు లీడర్లు కానీ.. ఇటు క్యాడర్ కానీ లేదు. టీఆర్ఎస్ నుంచి వచ్చే అసంతృప్తుల కోసం ఎదురు చూస్తోంది.
మొత్తంగా టీడీపీ ఎంట్రీ.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక మలుపులకు కారణం అయ్యే అవకాశం ఉందనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.