Chandrababu Letter To Election Commission: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 మంది చనిపోయారని లేఖలో తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తోన్న సీఎస్ పై.. సంబంధిత అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీపై ఫిర్యాదు చేశారు. 


లేఖలో ఏం చెప్పారంటే.?


'ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలన్న కేంద్ర ఎన్నికల సంఘ సూచనలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని.. ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కోరినా ఫలితం లేకపోయింది. సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్న దృష్ట్యా వారి ద్వారా పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చెయ్యొచ్చు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఎండలో వృద్ధులు పెన్షన్ దారులను సచివాలయాలకు పిలిచారు. సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా 60 లక్షల మంది పెన్షన్ దారులు ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 33 మంది ఎండదెబ్బకు మృతి చెందారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించి ఉంటే ఇలా జరిగేది కాదు. పింఛను దారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు కల్పించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన సీఎస్ పైనా చర్యలు చేపట్టాలి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వండి. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకోండి.' అంటూ చంద్రబాబు లేఖలో కోరారు.


Also Read: Pawan Campaign : కోలుకున్న పవన్ కల్యాణ్ - ఆదివారం నుంచి ఉత్తరాంధ్ర ప్రచారం !