Telugu Desam Party : దెందులూరు తెలుగుదేశం(TDP) శ్రేణులకు చంద్రబాబు శుభవార్త చెప్పేశారు. తెలుగుదేశం ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌కు సీటు కన్ఫార్మ్‌ చేశారు. స్వయంగా అధినేత చంద్రబాబే(Chandra Babu) ఆయనకు ఫోన్ చేసి టిక్కెట్‌ నీకేనంటూ చెప్పడంతో ఆయన ఆనందానికి అవదుల్లేవ్..నేడు ప్రకటించనున్న రెండో జాబితాలో చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prbhakar) పేరు ఉండే అవకాశం ఉంది..


చింతమనేని చింత తీరింది
తెలుగుదేశం(TDP) ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు సీటు కన్ఫార్మ్‌ అయ్యింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబే స్వయంగా ఆయనకు ఫోన్‌ చేసి సీటు కన్ఫార్మ్‌ చేశారు. బుధవారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు కార్యాలయం నుంచి చింతమనేనికి ఫోన్ వచ్చింది. స్వయంగా చంద్రబాబే(Chandra Babu) మాట్లాడుతూ..ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ మనం గెలవాలి..సీటు నీకే ఇస్తున్నాం గెలిపించుకుని తీసుకురా అంటూ చెప్పడంతో చింతమనేని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నిరోజుల ఊగిసలాటకు తెరదించుతూ సీటు కేటాయించడంపై ఆయన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సర్వేల్లో నువ్వు మంచి మెజార్టీతో గెలవబోతున్నావని...మంచి పదవిలో కూడా ఉంటావని చెప్పడంతో చింతమనేని(Chinthamaneni Prabhakar) ఆనందానికి  అవదుల్లేవ్‌. సీటు ఇవ్వడంతోపాటు చంద్రబాబు కొన్ని జాగ్రత్తలు సైతం చెప్పారని తెలిసింది. దూకుడు కొంత తగ్గించుకోవాలని...అతి విశ్వాసం అసలు వద్దని జాగ్రత్తగా  పోలింగ్ నిర్వహించాలని చెప్పినట్లు తెలిసింది. 


కుమార్తె పేరిట సర్వే
తొలి జాబితాలోనే దాదాపు వంద సీట్లు ప్రకటించిన చంద్రబాబు... కచ్చితంగా ఇస్తారనుకున్న దెందులూరు టిక్కెట్ పెండింగ్‌లో పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్‌ దూకుడు వ్యవహారం కొంత వివాదస్పదమైంది. ఎమ్మార్వోతో గొడవ, విలేకరిపై దాడి, కోడిపందెలు, మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై బహిరంగ వ్యాఖ్యలు ఇవన్నీ పార్టీని కొంత ఇబ్బందిపెట్టడంతో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుగుదేశం నేతలే చర్చించుకున్నారు. దీన్ని బలపరుస్తూ ఆయనకు మొదటి విడత కోటాలో టిక్కెట్ కన్ఫార్మ్ చేయలేదు. దీంతో దెందులూరు తెలుగుదేశం శ్రేణులతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ తెలుగుదేశం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చింతమనేని దూకుడు కొంత ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ....వైసీపీ(YCP) నేతలను తట్టుకోవాలంటే ఆమాత్రం ఫైర్  ఉండాల్సిందేనంటూ చంద్రబాబుకు సూచించారు.


చింతమనేని ప్రభాకర్‌కు కేవలం ఆయన నియోజకవర్గంలోనే గాక... రాష్ట్రవ్యాప్తంగానూ అభిమానులు ఉన్నారు. సభలోనూ, బయట జగన్‌పై ఒంటికాలుపై దూసుకెళ్లడం, వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పడంలో చింతమనేని ధిట్ట. ఈ దూకుడే ఆయనకు ప్రజాభిమానం తెచ్చిపెట్టినా....పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులనూ తెచ్చిపెట్టాయి. దీంతో ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని మొదటి భావించారు. అందులో భాగంగానే చింతమనేని ప్రభాకర్ కుమార్తె పేరిట ఐవీఆర్ఎస్(IVRS) సర్వే సైతం నిర్వహించారు. అయితే ఎక్కువ మంది చింతమనేని ప్రభాకర్‌ ఉంటేనే బాగుంటుందని చెప్పడంతో....అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపింది.


నేడు మలి జాబితా 
తెలుగుదేం-జనసేన, బీజీపై మధ్య పొత్తుల కొలిక్కిరావడంతో చంద్రబాబు మలివిడత జాబితా సిద్ధం చేశారు. ఇంకా ప్రకటించాల్సి ఉన్న 50 అసెంబ్లీ సీట్లతోపాటు...17 పార్లమెంట్‌ స్థానాల్లో కొన్నింటిని నేడు విడుదల చేయనున్నారు. ఇందులో చింతమనేని ప్రభాకర్ పేరు సైతం ఉండే అవకాశం ఉంది.అందుకే స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసిన చింతమనేనికి చెప్పినట్లు  తెలిసింది