Nellore Politics : వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చుట్టూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి- తమ జోలికి రావొద్దు రిక్వస్ట్‌

Nellore News : వీపీఆర్ చేరికతో కోవూరు అసెంబ్లీ సీటు సందిగ్ధంలో పడింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ వీపీఆర్ ని తరచూ కలుస్తున్నారు. బాబ్బాబు.. మా సీటుకి ఎసరు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Continues below advertisement

Andhra Pradesh News: నెల్లూరు జిల్లా రాజకీయం ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. టీడీపీ తరపున ఆయన నెల్లూరు లోక్ సభకు పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. అయితే అది అధికారికం కాదు. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కూడా జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికారికంగా నలుగురి పేర్లు మాత్రమే ఖాయమయ్యాయి. మిగతా చోట్ల ఇన్ చార్జ్ లు ఉన్నా కూడా వారికి సీట్లు అనుమానమే. అందులోనూ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎవరి సీటుకి ఎసరు వస్తుందోననే ఆందోళన మిగతావారిలో ఉంది. ఈ నేపథ్యంలో వీపీఆర్ సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అందుకే కోవూరు టీడీపీ నేతలు ఇప్పుడు వీపీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయన్ను ప్రసన్నం చేసుకోడానికి ఆపసోపాలు పడుతున్నారు. 

Continues below advertisement

వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడు కూడా వీపీఆర్ కోవూరు టికెట్ తన భార్యకు ఇవ్వాలని అడిగారట. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కాదని జగన్ ఆ సీటు వేమిరెడ్డి భార్యకు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆ ప్రస్తావన అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలో చేరడంతో, ఆయన కోవూరు సీటు అడిగే అవకాశం ఉంది. అయితే కోవూరులో ప్రస్తుతం పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఆయన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో నల్లపురెడ్డి ప్రసన్నపై పోలంరెడ్డి గెలిచారు, 2019లో ఓడిపోయారు. 2014లో ఆసీటు తన కొడుక్కి వస్తుందని ఆశించారు, ఆయన ముందునుంచి చేసిన ప్రయత్నాల వల్ల పోలంరెడ్డి దినేషన్ రెడ్డినే కోవూరుకి ఇన్ చార్జ్ గా నియమించారు చంద్రబాబు. కానీ వీపీఆర్ చేరికతో ఆ సీటు సందిగ్ధంలో పడింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ వీపీఆర్ ని తరచూ కలుస్తున్నారు. బాబ్బాబు.. మా సీటుకి ఎసరు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.  

రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని రోజుల్లో కూడా జిల్లాకు చెందిన వ్యాపారవేత్తగా రాజకీయ నాయకులకు ఆర్థిక సాయం చేసేవారు వీపీఆర్. ఆయన ద్వారా ఎలక్షన్ ఫండ్ తీసుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఆయనకు వ్యాపారాల్లో పరోక్షంగా సాయపడేవారు నాయకులు. పార్టీలకతీతంగా ఈ సాయం జరిగేది. ఆయన టీడీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలనుకోవడంతో ఆ పార్టీ ఆశావహులకు కూడా వీపీఆర్ కొండంత అండగా కనపడుతున్నారు. నాయకులంతా ప్రతి రోజూ ఆయన ఇంటి ముందు పరేడ్ చేస్తున్నారు. వీపీఆర్ కంట్లో పడాలని ఆశపడుతున్నారు. నెల్లూరు లోక్ సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల నేతలంతా రోజుకొకరు ఆయనతో భేటీ అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాలకు ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా తమ అనుచరులను తీసుకొచ్చి వీపీఆర్ కి పరిచయం చేస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత వీపీఆర్ ఆఫీస్ నేతలతో బిజీబిజీగా మారిపోయింది. 

 

Continues below advertisement