ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 సీన్ 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందా ? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మళ్లీ కలుస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలను సూచిస్తున్నాయ్. ఢిల్లీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో విభేదాలను పక్కనపెట్టి ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు సమసిపోయాయని రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం అప్పట్లోనే మొదలైంది.
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్ హిట్ అయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడ్డాయ్. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైతే జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. బీజేపీ ఒక్క శాతం ఓట్లే దక్కించుకుని.. ఏపీలో అడ్రస్ లేకుండాపోయింది. పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన తిరిగి ఏకమయ్యాయి. టీడీపీ కూడా బీజేపీతో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆ కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా..? అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య ఉన్న కొద్దిపాటి సమస్యలు పరిష్కారం అవుతాయని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. బహిరంగంగా చెప్పకున్నా.. టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసేసుకున్నాయనేలా.. పవన్ కల్యాణ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీ-బీజేపీ పార్టీలను తిరిగి ఒకే తాటి మీదకు తెచ్చేందుకు పవన్ మధ్యవర్తిత్వం వహించారు. దీన్ని జనసేనాని కూడా బహిరంగంగానే అంగీకరించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూసుకునే క్రమంలోనే బీజేపీ పెద్దలను కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత చంద్రబాబు వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఏపీకి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మళ్లీ కలుస్తున్నాయంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. నాయకత్వ మార్పు తర్వాత పొత్తుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు తగ్గిపోయాయి. ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. మరిది చంద్రబాబును పురంధేశ్వరి ఎక్కడా పల్లెత్తు మాట అనడం లేదు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించేశారు.
ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్బంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అదే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రావడం చంద్రబాబు, నడ్డా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడంతో ఏపీలో టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. విపక్షాలన్నీ కూటమిగా ఏర్పాటు కావడంతో బీజేపీ తన పాత మిత్రులను మళ్లీ దగ్గరకు తీసుకుంటోంది. గతంలో ఎన్డీఏ కూటమిలో పని చేసిన పార్టీ నేతలను ఆహ్వానించి ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే బీజేపీతో కలిసి పని చేసేందుకు జేడీఎస్ ముందుకు వచ్చింది. ఇపుడు అదే దారిలో టీడీపీ కూడా బీజేపీతో కలిసి పని చేస్తుందా ? పాత మిత్రులు మళ్లీ దగ్గరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.