ఇటీవల నెల్లూరు జిల్లా సంగంలో వైసీపీ నేతలు, వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల లిస్ట్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన నేరుగా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆనంపై విమర్శలు సంధించారు. అసలు ఆనం రామనారాయణ రెడ్డికి తమ నియోజకవర్గంతో పనేంటని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకు పరిమితం కావాలని హితవు పలికారు. 


స్వచ్చంధంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై బురదచల్లడం సరికాదని అన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఓట్ల చేర్పులు, తొలగింపులో వాలంటీర్ల పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. గుర్తింపు కోసం ఆనం చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు స్వచ్చందంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు చేశారని, వారు చేస్తున్న సేవలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, అటువంటి వాలంటీర్లపై బురద చల్లడం సరికాదని అన్నారు  విక్రమ్ రెడ్డి. 


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు విక్రమ్ రెడ్డి. ఏడాదిగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని, గడప గడపకు ముందు వాలంటీర్లతో, నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమస్యలు తెలుసుకొనే క్రమంలో వాలంటీర్, వీఆర్ఓలు ప్రతి గడపకు వెళ్లి రెవెన్యూ సమస్యలను తెలుసుకొని జాబితాలు సిద్దం చేయాలని తామే సూచించామన్నారు. వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తుంటే రాజకీయ ఉనికి కోసం రామనారాయణ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మేకపాటి.  


సంగం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగుస్తున్నందున వాలంటీర్లతో ఆ కార్యక్రమంపై పురోగతిపై సమావేశం నిర్వహించామని తెలిపారు ఎమ్మెల్యే మేకపాటి. సంగం వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుంటే ఎలాంటి సంబంధం లేని పక్క జిల్లా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వచ్చి ఆరోపణలు చేశారని, అది మంచి పద్ధతేనా అని ప్రశ్నించారు. వాలంటీర్లు, నాయకులు ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణ చేసిన ఆనంకు వాలంటీర్లు, నాయకులకు ఇలా ఓట్లను తొలగించే అధికారం లేదనే విషయం తెలియకపోవడం శోచనీయమన్నారు.


సెలవు రోజుల్లో సమావేశాలు ఏంటనే ఆరోపణలకు కూడా విక్రమ్ రెడ్డి బదులిచ్చారు. గత ఏడాది కాలంగా ఆదివారాలు, సెలవు దినాల్లో  సైతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను  నిర్వహించిన విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా లేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు ముందుగా సమావేశాలు నిర్వహిస్తుంటే ఎటువంటి సంబంధం లేని ఆనం రామనారాణరెడ్డి ప్రశ్నించడం ఏంటని మండిపడ్డారు. 


నీ సంగతి చూస్కో..
పక్క జిల్లాలో శాసనసభ్యుడిగా గెలిపించిన వెంకటగిరి ప్రజలను వదిలేసి, వారి సమస్యలను పరిష్కరించకుండా ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ప్రశ్నించడం ఏంటన్నారు విక్రమ్ రెడ్డి. ఆత్మకూరులో టీడీపీకి ఎవరూ నాయకుడు లేరని, మీడియాలో కూడా ఎవరూ కనపడటం లేదని, ఈ దశలో రామనారాయణ రెడ్డి ప్రచారం కోసమే ఇలాంటి చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు విక్రమ్ రెడ్డి. పదేళ్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన సమయంలో సొసైటీ కార్యాలయంలో ఆనం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో అందరికీ తెలుసునన్నారు.