Balakrishna Comments: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించడం ద్వారా కూటమి పెద్దల వద్ద మంచి మార్కులు కొడదామని అనుకున్నారు ఏమో తెలియదు కానీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన అసెంబ్లీలో చేసిన కామెంట్స్ అడ్డదిడ్డంగా ఎదురు తిరిగాయి అనేది వాస్తవం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడగడంతోటే జగన్ మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చారు అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పుపట్టారు. ఎవరూ ఎవరిని గట్టిగా అడగలేదని అంటూ కామినేని మాటలను తప్పుపట్టారు. అయితే అందులో భాగంగా ఆయన వాడిన పదజాలం ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీశాయి. మాజీ ముఖ్యమంత్రి ని పట్టుకుని ఏకంగా సైకో లాంటి పదాలు వాడడంతో వైసిపి ఒక్కసారిగా భగ్గుమంది. ఇప్పుడు ఈ వివాదంలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చి ఆనాడు ఏం జరిగిందనే దానిపై ఒక లేఖ రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీ బాగుండడం కోసమే నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్‌ల కోరిక మేరకు తన ఆధ్వర్యంలో హీరోలందరూ జగన్‌ను కలిశామని దానివల్ల తన సినిమా 'వాల్తేరు వీరయ్య'తో పాటు బాలకృష్ణ 'వీర సింహారెడ్డి ' నిర్మాతలు పంపిణీదారులు లాభపడ్డారని స్పష్టత ఇచ్చారు. దీన్ని చూపిస్తూ వైసిపి బాలకృష్ణను, కూటమిని టార్గెట్ చేస్తున్నాయి. అయితే మరోవైపు ఇదే అంశంపై టిడిపి జనసేన మధ్య కూడా కాస్త గట్టిగానే కామెంట్స్ పాస్ అవుతున్నాయి.

Continues below advertisement


జనసేన, టీడీపీ మధ్య కొత్త వివాదం 


చిరంజీవి జనసేనలో లేకపోయినా జనసేన సభ్యులు ఆయనను తమ వాడిగానే భావిస్తుంటారు.ఆయన కూడా ఆ మధ్య ఒకప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అన్నట్టు మాట్లాడారు. అలాంటిది తమ అధినేత సోదరుడిని టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో సంభోధించిన విధానంఫై మెగా అభిమానులు, జన సైనికులు సీరియస్‌గానే ఉన్నారు. ఇప్పటికే టీవీ డిబేటుల్లో ఈ అంశంపై మాట్లాడుతూ తమ బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా రాయపాటి అరుణ లాంటి వాళ్ళు అయితే ఒక ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ బాలకృష్ణ మాటలకు మనసుకు ఫిల్టర్ ఉండదంటూ అన్నారు.నిజానికి కొంతకాలంగా టిడిపి జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు, విభేదాలు ఉన్న మాట వాస్తవం. దానిని జనసేన అగ్ర నాయకత్వం సర్ది చెప్పుకుంటూ వస్తోంది. 
 
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఇరు పార్టీల నేతల మధ్య అసెంబ్లీ సాక్షిగా కొన్ని వివాదాలు తలెత్తాయి. టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా పరిశ్రమలు పొల్యూషన్ పై మాట్లాడుతూ సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని అర్థం వచ్చేలా మాట్లాడడం  స్వయంగా పవన్ కళ్యాణ్ కే కోపాన్ని తెచ్చింది. దీనిపై గట్టిగానే ఆయన సమాధానం చెప్పారు. మరోవైపు టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కి మధ్య కూడా అసెంబ్లీలో ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఇప్పుడు అంతా సర్దుకుంది అనుకున్న సమయంలో ఒకప్పుడు పాత విషయాల్ని కామినేని లేవనెత్తడం దాన్ని బేస్ చేసుకుని బాలయ్య ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి, జగన్‌ఫై వాళ్ళ అభిమానులు నాయకులు బాధపడేలా మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనమయ్యాయి. 


చిరంజీవి ఒక కౌంటర్ ఇస్తూ లేఖ రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అంటూ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు తన అన్నయ్యని అవమానించారు అంటూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు అంటూ వైసిపి నాయకులు కామెంట్ చేస్తున్నారు.ఇవన్నీ ఎలా ఉన్నా  అసలీ టాపిక్ ఎందుకు మొదలు పెట్టానా అంటూ తల పట్టుకోవడం కామినేని వంతు అయింది అంటున్నారు సన్నిహతులు.