TamilNadu Cabinet Expansion: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ముందు ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన కేబినెట్ విస్తరణ సవాల్ నిలిచింది. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చిన టీవీకే , సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. కేవలం తొమ్మిది మంది మంత్రులతో చిన్న కేబినెట్‌ను ప్రారంభించిన విజయ్, తదుపరి విస్తరణలో మిత్రపక్షాల డిమాండ్ల, అంతర్గత రాజకీయ సమీకరణాలను ఎలా సమన్వయం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అన్నాడీఎంకే రెబల్స్ రాజకీయం
విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిస్వామి పై తిరుగుబాటు చేసి విజయ్‌కు అండగా నిలిచారు. అయితే, వీరికి కేబినెట్‌లో చోటు కల్పిస్తే అది రాజకీయ అనైతికత అవుతుందని విదుతలై చిరుతైగల్ కట్చి వంటి మిత్రపక్షాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తే పార్టీ సిద్ధాంతానికే ముప్పు వస్తుందని, అన్నాడీఎంకే రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని వీసీకే నేత తిరుమావళవన్ బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ డిమాండ్లు - పవర్ షేరింగ్ అనివార్యం!
చాలా ఏళ్ల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌కు కనీసం రెండు లేదా మూడు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అధిష్టానం సంకేతాలిస్తోంది. ముఖ్యంగా మేలూరు ఎమ్మెల్యే పి. విశ్వనాథన్ , కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత రాజేష్‌కుమార్‌లకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని తమిళ మీడియా కోడై కూస్తోంది. రాహుల్ గాంధీతో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కాంగ్రెస్‌ను విస్మరించడం ఆయనకు సాధ్యం కాకపోవచ్చు.
వీసీకే ఎత్తుగడ - డిప్యూటీ సీఎం పోస్ట్?
ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకమైన వీసీకే ఇప్పుడు కింగ్ మేకర్ పాత్రలో ఉంది. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ పెట్టిన ప్రధాన షరతులలో డిప్యూటీ సీఎం పదవి ఒకటి అని తెలుస్తోంది. దళిత ఓటు బ్యాంకును భారీగా ప్రభావితం చేసే వీసీకేకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు కీలక పోర్ట్‌ఫోలియోలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ ఈ డిమాండ్‌కు తలొగ్గితే, తమిళనాడు చరిత్రలోనే ఒక దళిత నేత ఉప ముఖ్యమంత్రి కావడం విశేషం అవుతుంది. అయితే, ఇది ఇతర సామాజిక వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని టీవీకే వ్యూహకర్తలు ఆలోచనలో పడ్డారు.
సొంత పార్టీ నేతల అసంతృప్తి ముప్పు
కేవలం తొమ్మిది మందితోనే కేబినెట్ ఏర్పాటు చేయడంతో, టీవీకేలోని సీనియర్ నేతలు , క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు తమకు ఎప్పుడు అవకాశం దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. మిత్రపక్షాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, పార్టీని నిర్మించిన వారు అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే విజయ్ తన కేబినెట్‌లో కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం మరియు మిత్రపక్షాల గౌరవం.. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సురక్షితంగా ఉన్నప్పటికీ, కేబినెట్ విస్తరణలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మిత్రపక్షాలు వైదొలిగే ముప్పు పొంచి ఉంది. అందుకే, విస్తరణ ప్రక్రియను అత్యంత గోప్యంగా, జాగ్రత్తగా నిర్వహించాలని విజయ్ భావిస్తున్నారు.
