AIADMK Split Whip Controversy:  తమిళనాడు అసెంబ్లీలో బుధవారం జరగనున్న విశ్వాస పరీక్ష కేవలం ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ మనుగడను తేల్చేది మాత్రమే కాదు.. అది  ప్రతిపక్షం అన్నాడీఎంకే మనుగడను కూడా శాసించబోతోంది. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన నిలబడటం ఇప్పుడు రాజ్యాంగపరమైన ఉత్కంఠకు దారితీసింది. పళనిస్వామి రహస్యంగా డీఎంకేతో చేతులు కలిపారన్న ఆరోపణలు చేసి  సీవీ షణ్ముగం ,  ఎస్పీ వేలుమణి వంటి దిగ్గజాలు టీవీకే  గూటికి చేరడం తమిళ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికింది.

Continues below advertisement

 విప్ వర్సెస్ రాజ్యాంగ రక్షణ                  

పళనిస్వామి వర్గం ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు  విప్ జారీ చేసింది. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఉల్లంఘిస్తే  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్  ప్రకారం సభ్యత్వం రద్దవుతుందని హెచ్చరించింది. అయితే, ఇక్కడే ఒక సాంకేతిక చిక్కు ఉంది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో  మూడింట రెండొంతుల మంది** విడిపోయి మరో పార్టీలో విలీనమైతే, వారిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. అన్నాడీఎంకేకున్న 47 మంది ఎమ్మెల్యేలలో 32 మంది మద్దతు ఉంటే ఈ  విలీనం చట్టబద్ధం అవుతుంది. ప్రస్తుతం విజయ్ పక్షాన 30 మంది ఉండగా, మరో ఇద్దరిని ఆకర్షించగలిగితే అన్నాడీఎంకే విప్ నీరుగారిపోవడం ఖాయం.

Continues below advertisement

 స్పీకర్ విచక్షణాధికారమే కీలక అస్త్రం                       

ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 32కు చేరకపో యినా, తక్షణమే అనర్హత వేటు వేయడం అంత సులభం కాదు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ విజయ్ పార్టీకి చెందిన వారు కావడం టీవీకేకు అతిపెద్ద సానుకూలాంశం. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం.. అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుంది. స్పీకర్ ఈ ప్రక్రియపై విచారణ పేరుతో నెలల తరబడి జాప్యం చేసే అవకాశం ఉంది.  స్పీకర్ నిర్ణయం ఒకవేళ తమకు వ్యతిరేకంగా ఉంటే, పళనిస్వామి వర్గం తక్షణమే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఉదంతాలను వారు ఉటంకిస్తున్నారు. అయితే, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకునే విచక్షణ నిర్ణయాల్లో కోర్టులు త్వరగా జోక్యం చేసుకోవు. దీంతో న్యాయపోరాటం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది, ఇది పరోక్షంగా విజయ్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా మారుతుంది.

 వ్యూహకర్తగా విజయ్.. నామమాత్రంగా అన్నాడీఎంకే?                      

విజయ్ వ్యూహకర్తలు అత్యంత చాకచక్యంగా అన్నాడీఎంకే కోటను బద్దలు కొడుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగలిగితే, చట్టసభలో అన్నాడీఎంకే కేవలం 15 మంది ఎమ్మెల్యేలతో నామమాత్రపు పార్టీగా మిగిలిపోతుంది.   పళనిస్వామి వైఖరిపై విసిగిపోయిన కేడర్ కూడా ఇప్పుడు విజయ్ వైపు ఆశగా చూస్తున్నారు.  రాజ్యాంగపరమైన విరుగుడు మంత్రాలతో సిద్ధమైన విజయ్, పళనిస్వామి విప్ హెచ్చరికలను ఎలా అధిగమిస్తారో చూడాలి.