AP local body elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త ఎస్‌ఈసీ అనిల్ కుమార్ పునేఠా నిర్వహించిన సమీక్షా సమావేశం రాష్ట్రంలో ఎన్నికల వేడిని ఒక్కసారిగా పెంచింది. వచ్చే మూడు నెలల కాలంలో పెండింగ్‌లో ఉన్న పంచాయతీ, పరిషత్ , మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకపక్ష ఎన్నికల ఆరోపణల కారణంగా , ఈసారి అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరపాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
కూటమికి సొంత చిక్కులు
స్థానిక ఎన్నికల నిర్వహణ కూటమి ప్రభుత్వానికి అంత సులభం కాదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అద్భుత విజయం సాధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా జనసేన, బీజేపీలు ఈసారి గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పట్టుబట్టే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీల కిందిస్థాయి నేతలు ఇప్పటికే ఒత్తిడి పెంచుతున్నారు. ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలు.. ఇప్పుడు తమకు రావాల్సిన పదవులను పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉన్న టీడీపీ క్యాడర్‌ను కాదని జనసేన లేదా బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయిస్తే, అది తిరుగుబాటుకు దారితీయవచ్చు. ఇదే జరిగితే కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు గ్రహించారు.
చంద్రబాబు వెయిట్ అండ్ వాచ్ వ్యూహం?
ఎన్నికల నిర్వహణపై ప్రకటనలు వస్తున్నప్పటికీ, లోలోపల చంద్రబాబు కొంత జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పార్టీల మధ్య సమన్వయం కుదర్చడమేనని తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను వేసి, అసంతృప్తిని తగ్గించిన తర్వాతే నోటిఫికేషన్‌కు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎస్‌ఈసీ కసరత్తు చేస్తున్నా, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
భారీ ప్రాధాన్యత కోరుతున్న జనసేన
మరోవైపు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఈసారి స్థానిక సంస్థల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో తమకు గౌరవప్రదమైన సంఖ్య దక్కాలని ఆ పార్టీ కోరుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ మూడు పార్టీల డిమాండ్లను సమతూకం చేయడం చంద్రబాబుకు కత్తిమీద సాము లాంటిదే. వచ్చే మూడు నెలలు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. అటు వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం కంటే, ఇటు కూటమిలోని పార్టీల మధ్య సఖ్యతను కాపాడుకుంటూ సీట్ల పంపిణీ పూర్తి చేయడమే చంద్రబాబు ముందున్న ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే, కొన్ని చోట్ల 'ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం.
