Janasena Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పవన్ కల్యాణ్ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా పూర్తి స్థాయి రాజకీయాలు ప్రారంభించలేదు. ఇటీవల వారాంతాల్లో కూడా ఆయన ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు.కానీ వరుసగా సినిమాలు ప్రారంభిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ .. ఎప్పుడు వారాహి యాత్ర మొదలు పెడతారు.. ఎప్పట్నుంచి పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తారన్న చర్చ ప్రారంభమయింది.
వరుస సినిమాలో పవన్ ఫుల్ బిజీ !
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తిచేయడం దృష్టి సారించాడు. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటుగా వినోదయ సిత్తం రీమేక్‌ను కూడా ప్రారంభించejg. పి. సముద్రఖని దర్వకత్వం వహించ నున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లును ముందుగా ఏప్రిల్‌లో అనుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో దసరాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ , ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను ప్రారంభించారు. వీటి షూటింగ్‌లు పూర్తి కావాలంటే ఏడాది పైనే పడుతుంది. అంటే ఎన్నికలు వచ్చేస్తాయి. మరి ఎప్పుడు పవన్ రాజకీయాల కోసం సమయం కేటాయిస్తారు.
వారాహి యాత్రపై రాని క్లారిటీ !
పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై క్లారిటీ రావడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది ముందు నుంచే ఆయన ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించారు. ఆగుతూ సాగినా యాత్ర అయితే కొనసాగించారు. ఈ సారి మాత్రం యాత్ర ప్రారంభించడానికే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారాహి పేరుతో ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అడ్డుకుంటామని అధికార పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అడ్డుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అసలు వారాహీ రోడ్డు మీదకు రావడం లేదు. ఇప్పుడు వైసీపీ నేతలే వారాహి రావడం లేదేమిటా అని వాకబు చేస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున వారాహి రోడ్డు మీదకు రావడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని కూడా ప్రజల్లోకి వస్తే వైసీపీ పాలనా తీరు వ్యవహారం అంతా ప్రజల్లోకి చర్చకు వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత అంతా బహిరంగమవుతుందని జనసే వర్గాలు చెబుతున్నాయి. పవన్ యాత్ర చేస్తే జనసేన పరిస్థితి మెరుగుపడుతుందని హరిరామ జోగయ్య కూడా చెబుతున్నారు.
చివరి ఆరు నెలలు ఎన్నికల కోసం కేటాయిస్తారా ?
కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉన్నందున… చివరి ఆరు నెలలు జనంలో ఉంటే చాలని ఆయన అనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఒక్కరే తిరుగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ వేరు.. నాదెండ్ల వేరు. అయితే పవన్ కల్యాణ్ సభ్యత్వ నమోదు ఇతర పార్టీ అంతర్గత అంశాలపై రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని.. రాజకీయ వాతావరణానికి తగ్గట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.