Sharmila Has Plan For strengthen AP Congress : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఐకాన్‌గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను పూర్తిగా పార్టీకి ప్లస్ అయ్యేలా చేసుకోవడానికి భిన్నమైన ప్లాన్లతో ముందడుగు వేస్తున్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ వైసీపీని ప్రారంభించారు. వైఎస్ అభిమానులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ వెంట నడిచారు. అసలైన కాంగ్రెస్ అదే అన్నట్లుగా ఇంత కాలం రాజకీయం నడిచింది. అయితే ఇప్పుడు షర్మిల దాన్ని మార్చాలని డిసైడయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ వాది అని.. కాంగ్రెస్ వల్లే ఆయనకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడని..రాహుల్ ను ప్రధాని చేయాలన్నది ఆయన చివరి కోరిక అని చెబుతున్నారు. ఇటీవల వైసీపీ వైఎస్ ఇమేజ్ పై ఆధారపడటం తగ్గించుకోవడం ప్రారంభించింది. జగన్ కే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ పరిణామాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని షర్మిల డిసైడయ్యారు.
వైఎస్ జయంతిని భారీగా నిర్వహిస్తున్న షర్మిల
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75న జయంతిని కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడలో అత్యంత భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌కు అత్యంత ఆత్మీయులుగా పేరుపడిన నేతలందర్నీ పిలుస్తున్నారు. వైసీపీలో చాలా మంది వైఎస్ సన్నిహిత నేతలు ఉన్నారు. వారంతా ఇప్పటికీ వైఎస్ పై అభిమానంతో ఉన్నారు. వారిని ఈ కార్యక్రమానికి షర్మిల ఆహ్వానిస్తున్నారు. వైసీపీ .. వైఎస్ 75వ జయంతికి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. మామూలుగా అయితే ప్లీనరీ నిర్వహించేవారు. ఈ సారి పార్టీ ఓడిపోవడంతో ప్లీనరీ కూడా నిర్వహించడం లేదు. వైఎస్ కు ఎలాంటి నివాళి అర్పించే కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు.
ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలూ ప్లాన్ చేయని వైసీపీ
కానీ షర్మిల మాత్రం అత్యంత ఘనంగా వైఎస్ జయంతిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ ఘోరమైన ఓటమి తర్వాత ఆమె పలువురు నేతలను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో వైసీపీ పరిస్థితి దిగజారుతుందని.. 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వస్తుందని అప్పుడు మంచి భవిష్యత్ ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఓ కొలిక్కి వస్తాయని.. కొత్తగా గత పాలనలో ఏపీ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో వైసీపీ కోలుకోవడం కష్టమని చెబుతున్నారు. ముందుగా కాంగ్రెస్ లో చేరిన వారికి భవిష్యత్ ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు.
తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ మద్దతుతో షర్మిల ముందడుగు
తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో వారి మద్దతు తీసుకుని షర్మిల ఏపీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలపై ఆకర్ష్ ప్రయోగించడంలో.. తెలంగాణ , కర్ణాటక కాంగ్రెస్ నేతలు సహకరించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ తరపున టిక్కెట్ రాని వారు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. వారి చేరిక వెనుక బలమైన లాబీయింగ్ ఉందని.. అదే ముందు ముందు కొనసాగుతుందని భావిస్తున్నారు.