Sharmila News: కళ్ళు మోసం చేస్తాయి కానీ ప్రత్యక్ష సాక్షులకు అంతా తెలుస్తుంది కదా.. వారు చెప్పిన కథనమే ఇది. వైఎస్ షర్మిల కుమారుడు వివాహ నిశ్చతార్థానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌తో షర్మిల పెద్దగా కలవలేదా అంటే అవుననే అంటున్నారు ఆ ఫంక్షన్‌కు హాజరైన వారు. స్వయంగా జగనే కల్పించుకుని షర్మిలతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె పెద్దగా స్పందించ లేదని అంటున్నారు వారు. దానితో అన్నా చెల్లెళ్ల మధ్య ఈ స్థాయిలో గ్యాప్ పెరిగిపోయిందా అంటున్నారు ఈ సంగతి తెలిసిన వారు. 




ఆహ్వానం ఫోటోలు నో... ఫంక్షన్ ఫోటోలు..వీడియోలు విడుదల చేసిన ఏపీ CMO
గత 10 రోజులుగా షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్‌కు చెందిన ఇన్విటేషన్‌లను రెండు రాష్ట్రాలలోని ప్రముఖులకు అందజేస్తూ వచ్చారు.. ముందుగా అన్న YS జగన్‌కే ఇచ్చారు కూడా. కానీ అందరితో ఆమె కలిసిన ఫోటోలు.. వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ సీఏం జగన్‌కు ఇన్విటేషన్ అందజేసిన ఫోటో ఒక్కటన్నా సోషల్ మీడియాలో కానీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూసిన గుర్తు ఉందా మీకు. ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా ఏపీ సీఎంవో కానీ..వైసీపీ కానీ విడుదల చేయలేదు. ఎంగేజ్మెంట్‌కు జగన్ హాజరైన వీడియోలు.. ఫోటోలు మాత్రం cmo ప్రతినిధులే మీడియాకు రిలీజ్ చేశారు. ఈ మధ్యలో జరిగిన కీలక పరిణామం షర్మిల ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ కావడమే.




All is well అని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారా?
ఏపీ సీఎం తన మేనల్లుడి ఎంగేజ్ మెంట్ సందర్భంగా తమ కుటుంబంలో అంతా బాగానే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని అంటున్నారు పరిస్థితులను గమనిస్తున్న వారు. కారణం ఏదైనా కావొచ్చు సీఎం జగన్ కచ్చితంగా తన కుటుంబానికి దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నారని ఆ వీడియోలు..ఫోటోలు చూసిన వారికి అనిపిస్తుంది. 


షర్మిలనే ఇష్టపడడం లేదా?
ఈ వ్యవహారం మొత్తంలో ys షర్మిలనే అన్నతో దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు ఆ ఫంక్షన్‌కు హాజరైన వారు. జగన్ తన సోదరిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలని చూసినా కనీసం అన్న మొఖంలో మొఖం పెట్టి చూడలేదని అంటున్నారు ఇతర అతిథులు. వీడియోలో సైతం  జగన్ దగ్గరకు రమ్మని పిలుస్తున్నా షర్మిల కనీసం అటువైపు చూడలేదు. తన వైఖరి చూసి ఆమె భర్త అనిల్ కూడా సందిగ్ధంలో పడిపోవడం స్పష్టంగా కనిపించింది. దానితో తన తల్లి విజయమ్మతో కాసేపు ముచ్చటించి జగన్ మేనల్లుడినీ ఆయనకు కాబోయే భార్యను ఆశీర్వదించి సతీసమేతంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళి పోయారని అంటున్నారు చూసినవాళ్లు




పవన్ కళ్యాణ్ కు పెద్దపీట
 ఇక ఇదే వేడుకకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఘన స్వాగతమే లభించింది. బ్రదర్ అనిల్ షర్మిల స్వయంగా ఆయనను ఆహ్వానించడమే కాకుండా ఉన్నంత సేపూ పవన్‌తో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. దీనితో ఏపీ రాజకీయంగా కొత్త బంధాలకు షర్మిల కుమారుడి నిశ్చితార్థం వేదికైందా అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా జగన్ తన బద్ద శత్రువులా భావించే పవన్‌కు ఆయన సోదరి తమ కుటుంబ వ్యవహారంలో ఇంతటి ఆదరం చూపడం జగన్ కు ఇబ్బంది కలిగించే అంశమే. ఏదేమైనా రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అనుకుంటూ వస్తున్న YSR అభిమానులకి అన్నా చెల్లెళ్ళ మధ్య వ్యక్తిగత స్థాయిలో పెరిగిపోయిన విభేదాలు షర్మిల కుమారుడి నిశ్చితార్థం సాక్షిగా బయటపడ్డాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు.