ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఏడాదిన్నరకుపైగానే ఎన్నికలకు టైం ఉంది. పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే హడావుడి మొదలుపెట్టేశాయి. పొత్తులు, సీట్లు, అంటూ రాజకీయాన్ని పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. మొన్నటి వరకు బీజేపీతో ఉన్న జనసేన కొన్ని రోజుల క్రితం నుంచి ప్లాన్ మార్చారు. టీడీపీతో పొత్తు దిశగా చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. అటు టీడీపీ కూడా కలిసి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు పంపిస్తోంది. ఈ రెండు కలిసి వెళ్తే బీజేపీ ఏ గట్టున ఉంటుందనే చర్చ మొదలైంది.
అటు పొత్తుల్లో ఉండాలా లేకుంటే ఒంటరిగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవాలా అనే అంశంపై చర్చించేందుకు ఇవాళ(మంగళవారం) బీజేపీ రాష్ట్రకార్యవర్గం భేటీ కానుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి... ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా పోరాటం చేయాలనే విషయాలపై చర్చించేందుకు భీమవరం వేదికగా ఈ సమావేశం జరగనుంది.
కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఈ భేటీకి ఇద్దరు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే భారతీ ప్రవీణ్ పవార్ రాష్ట్రంలో పర్యటిస్తూ కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ఆమె ఈ భేటీకి రానున్నారు. ఆమెతోపాటు మరో కేంద్రమంత్రి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరితోపాటు అధిష్ఠానం తరఫున బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సమావేశాల్లో పాల్గొంటారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమువీర్రాజుతోపాటు సుమారు నాలుగు వందల మంది బీజేపీ లీడర్లు ఈ భేటీలో పాల్గొంటారు.
అసలు జనసేనతో ఎలా ఉండాలి... ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, టీడీపీతో జనసేన కలిస్తే అనుసరించాల్సిన వ్యూహం ఏంటి... ఇలా పలు కీలకమైన విషయాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. కేంద్రం నిధులను ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాల కోసం వాడుకుంటోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు దీనిపై ఎలాంటి పోరాటాలు చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.
కన్నా దూరం!
వచ్చే ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న ఆయన మొన్నటి జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యకవర్గ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టబోతున్నారని తెలుస్తోంది.
రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ ఎప్పటి నుంచో అసహనంతో ఉన్నారు. తాను నియమించిన జిల్లా అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంపై ఈ మధ్య కాలంలోనే సీరియస్ కామెంట్స్ చేశారు. నేరుగా సోమువీర్రాజుపైనే విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉన్నప్పటికీ ఆయన ఛరిష్మాను వినియోగించుకొని పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ఏర్పాటుకు కూడా కొందరు కుట్ర చేస్తున్నారని... సోమువీర్రాజు వియ్యంకుడు ఆ పార్టీలోకి వెళ్లడానికి కారణాలను విశ్లేషించారు. ఇలా సమయం చిక్కినప్పుడల్లా బీజేపీ రాష్ట్రనాయకత్వంపై విమర్సలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెదకూరపాడులో ఆయన అనుచరులు కీలక భేటీ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేందుకు అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు సమాచారం. గతంలో కూడా ఇలాంటి ఆత్మీయ భేటీలు జరిగాయి. నేరుగా కన్నా లక్ష్మీనారాయణే భేటీలు నిర్వహించారు. అప్పట్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. టీడీపీలోకి ఆయన వెళ్తున్నారనే టాక్ గట్టిగా వినిపించింది. కానీ అలాంటిదేమీ లేదని తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు, అనుచరులకు చెప్పే తీసుకుంటానని చెప్పారు. మళ్లీ ఇప్పుడు అదే టాక్ వినిపిస్తోంది. ఈసారి ఏకంగా డేట్ కూడా చెప్పేస్తున్నారు. జనవరి 26న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.